Sunday, March 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅండగా ఉంటాం...ఆందోళన వద్దు

అండగా ఉంటాం…ఆందోళన వద్దు

- Advertisement -

మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు
పరిహారం చెక్కుల పంపిణీలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. 2025 నవంబర్‌ 17న సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన బస్సుప్రమాదంలో నగరానికి చెందిన 44 మంది కుటుంబసభ్యులు మరణించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున సీఎం పరిహారం చెక్కులు అందచేశారు. అదే ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తికి రూ.3 లక్షలు పరిహారం అందించారు. శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం ఈ చెక్కులను బాధిత కుటుంబాలకు అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించవనీ, కానీ బాధితుల కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించామని తెలిపారు. పరిహారం అంశాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకున్నామని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం కల్గించడం కోసమే ఆయా కుటుంబాలను సెక్రటేరియట్‌కి పిలిచి పరిహారం అందిస్తున్నామని తెలిపారు. ఆనాడు ప్రమాదం గురించి తెలియ గానే సహాయ చర్యల పై కేంద్రంతో తానే స్వయంగా మాట్లాడాననీ, మంత్రి అజారుద్దీన్‌ను మదీనా పంపించి తదుపరి కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. ‘ఇది మీ ప్రభుత్వం.ఆందోళన వద్దు. మీ కష్టం, ఆనందంలో మీకు తోడు గా ఉంటాం’ అని భరోసా ఇచ్చారు. ముస్లిం సోదరులకు రంజాన్‌ మాసం అత్యం త పవిత్రమైనదనీ, అంతా కలిసి మెలిసి ముందుకు వెళ్దామని చెప్పారు. 2009 నుంచి కొడంగల్‌లో ఏటా ఒక్కో మండలం నుంచి ఒకరి చొప్పున తానే స్వయంగా హజ్‌కు పంపిస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్‌ మాజిద్‌ హుస్సేన్‌, హజ్‌ కమిటీ చైర్మన్‌ ఖుష్రో పాషా, తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ వైస్‌ చైర్మెన్‌ ఫహీమ్‌ ఖురేషి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -