Sunday, August 3, 2025
E-PAPER
Homeకరీంనగర్బనకచర్ల ప్రాజెక్టును అన్ని దశలలో అడ్డుకుంటాం..

బనకచర్ల ప్రాజెక్టును అన్ని దశలలో అడ్డుకుంటాం..

- Advertisement -

ఆగస్టులోగా ‘నారాయణపూర్‌’ భూసేకరణ నిధులిస్తాం
రూ.3.17కోట్ల మందికి నెలకు 6కిలోల సన్నబియ్యం సరఫరా
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

సన్న బియ్యం, నూతన రేషన్‌ కార్డుల పంపిణీ
నవతెలంగాణ – రామగుడు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును అన్ని దశలలో అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్న ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు తానూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గోదావరి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సిడబ్ల్యూసి వద్ద ఫిర్యాదు చేసి ప్రాజెక్టును అడ్డుకున్నామని, ప్రభుత్వ అభ్యంతరాలతో ఆ ప్రతిపాదనను తిరస్కరించారని తెలిపారు. ఈ అంశాన్ని అన్ని వేదికలపైనా, న్యాయపరంగానూ వ్యతిరేకిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్‌ పామెలా సత్పతి ఆదివారం కరీంనగర్‌ జిల్లా రామడుగు మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గానికి చెందిన పేద కుటుంబాలకు నూతన రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. రాష్ట్రంలోని 3.17కోట్ల మందికి నెలకు 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. గత ప్రభుత్వం సరఫరా చేసిన దొడ్డు బియ్యంతో 80 శాతం అక్రమాలు, రీసైక్లింగ్‌ జరిగేవని ఆయన ఆరోపించారు.

తమ ప్రభుత్వం రూ.13 వేల కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేస్తోందని, దేశంలో 84శాతం జనాభాకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 8.64లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ చేయగా మొత్తం కార్డు సంఖ్య 98.58లక్షలకు చేరిందని వెల్లడించారు.ఆగస్టులోగా ‘నారాయణపూర్‌’ భూసేకరణ నిధులిస్తాంనారాయణపూర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు భూసేకరణకు అవసరమైన నిధులను ఆగస్టు నెలలోనే మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ రిజర్వాయర్‌ పూర్తి చేయడం ద్వారా చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గత ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేసి మిగిలిన 10 శాతం పనులను నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ గురుకుల విద్యాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సివిల్‌ సప్లైస్‌ ఎండీ చౌహాన్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -