No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeరాష్ట్రీయంబనకచర్ల ప్రాజెక్టును అన్ని దశల్లో అడ్డుకుంటాం

బనకచర్ల ప్రాజెక్టును అన్ని దశల్లో అడ్డుకుంటాం

- Advertisement -

– ఆగస్టులోగా ‘నారాయణపూర్‌’ భూసేకరణ నిధులిస్తాం
– 3.17కోట్ల మందికి నెలకు 6కిలోల సన్నబియ్యం సరఫరా : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
– సన్న బియ్యం, నూతన రేషన్‌ కార్డుల పంపిణీ
నవతెలంగాణ – రామగుడు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును అన్ని దశల్లో అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్న ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు తానూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గోదావరి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సిడబ్ల్యూసీ వద్ద ఫిర్యాదు చేసి ప్రాజెక్టును అడ్డుకున్నామని, ప్రభుత్వ అభ్యంతరాలతో ఆ ప్రతిపాదనను తిరస్కరించారని తెలిపారు. ఈ అంశాన్ని అన్ని వేదికలపైనా, న్యాయపరంగానూ వ్యతిరేకిస్తామని పునరుద్ఘాటించారు. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్‌ పామెలా సత్పతితో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గానికి చెందిన పేద కుటుంబాలకు నూతన రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 3.17కోట్ల మందికి నెలకు 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని తెలిపారు. దేశంలో 84శాతం జనాభాకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 8.64లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ చేయగా మొత్తం కార్డు సంఖ్య 98.58లక్షలకు చేరిందని వెల్లడించారు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు భూసేకరణకు అవసరమైన నిధులను ఆగస్టు నెలలోనే మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రిజర్వాయర్‌ పూర్తి చేయడం ద్వారా చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేసి మిగిలిన 10 శాతం పనులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సప్లర్సు ఎండీ చౌహాన్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad