మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర
నవతెలంగాణ – కరీంనగర్
ఉత్తర తెలంగాణను ఎడారి ప్రదేశంగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్ పర్యటనకు వస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మండిపడ్డారు. శనివారం కరీంనగర్ పట్టణంలోని ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చొప్పదండి నియోజకవర్గ రైతులు సాగునీటి కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “రైతులు హరిగోస పడుతున్నారు. పంట పొలాలు ఎండిపోతున్నా, లక్షల క్యూసెక్కుల గోదావరి వరదనీరు సముద్రంలో కలుస్తోంది. అయినా ప్రభుత్వం నీటిని ఎత్తిపోకుండా రైతులను నిర్లక్ష్యం చేస్తోంది” అని ఆరోపించారు.
నీటిని విడుదల చేసిన తర్వాత మాత్రమే మంత్రులు పర్యటనలు చేయాలని, లేదంటే రైతులతో కలిసి పర్యటనలు అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం రైతులు బిందెల ద్వారా ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీరు పారిస్తుంటే, ప్రభుత్వం మాత్రం కళ్లు మూసుకుని చూస్తోందని విమర్శించారు. ఎస్సారెస్పీ, మిడ్ మానేరు, ఎల్ఎండి రిజర్వాయర్లు నీటి లెవల్స్ తగ్గిపోతున్నాయని, వీటిని నింపి నారాయణపూర్ ఎంఎండి, ఎల్ఎండి రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. “ప్రభుత్వానికి దండం పెట్టి, కాళ్ళు మొక్కి అడుగుతున్నాను. దయచేసి రైతులను కాపాడండి, వారికి నీళ్లు ఇవ్వండి” అని విజ్ఞప్తి చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవినీతి రాజ్యం లో ఉంది అని ఆరోపించిన ఆయన, ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, నాయకులు నారాయణరావు, జితేందర్ రెడ్డి, గంగాధర్, విజయేందర్ రెడ్డి, సురేందర్, నాజీర్, అఖిల్, చుక్కా శ్రీనివాస్, రమేష్, మల్లేష్, మల్లయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.