నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
భూమికోసం భుక్తి కోసం ఈ దేశం విముక్తి కోసం విప్లవోద్యమంలో అమరులైన అమరవీరుల పోరాటస్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. అమర వీరుల వర్ధంతి సందర్భంగా నగరంలోని నీలం రామచంద్రయ్య భవన్లో వర్ధంతి సభను డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సభలో ఆకుల పాపయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయని ,దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అదాని ,అంబానీలకు కట్టబెడుతున్నారన్నారు. దేశ సంపదలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న రైతులను,కార్మికులను భూముల నుండి పరిశ్రమల నుండి దూరం చేస్తున్నారని ఆయన అన్నారు. దేశ సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్ల సేవలో ప్రధాన మోడీ తరిస్తున్నారన్నారు. రైతుల పంటలకు కేంద్రంలో మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని, భారత రైతుల రుణాలను మాఫీ చేసి రుణ విముక్తులను చేయాలని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు బ్యాంకు ద్వారా తీసుకున్న 13లక్షల కోట్ల అప్పులను మాఫీ చేయించి వారి మెప్పు పొందారని అన్నారు.
మరొక దిక్కు కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్లు గా కుదించి కార్మికుల ఉపాధిని కొల్లగొట్టి వారి పనిగంటలను పెంచి శ్రమ దోపిడికి గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చర్యలను ఖండించాలని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు పరచడం లేదని అన్నారు. ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు తులం బంగారం వెంటనే అమలు పరచడం లేదని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తానన్న హామీ అమలు నోచుకోవడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచాలని ఆయన ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా డిచ్పల్లి మండలం కార్యదర్శి జేపీ గంగాధర్ మాక్లూర్ మండల కార్యదర్శి సాయి రెడ్డి ఐ ఎఫ్ టి యు నగర అధ్యక్షులు మల్లికార్జున్ శివకుమార్ మోహన్ నర్సింగ్ రావు నతానియల్ అరుణ భారతి తదితరులు పాల్గొన్నారు.



