Sunday, March 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅనసూయమ్మ ఆశయాలను కొనసాగిస్తాం

అనసూయమ్మ ఆశయాలను కొనసాగిస్తాం

- Advertisement -

ఆమె జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
అనసూయమ్మ మృతదేహానికి నివాళి అర్పించిన నేతలు

నవతెలంగాణ – దిల్‌సుఖ్‌నగర్‌
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్‌ మేదరమెట్ల అనసూయమ్మ ఆశయాలను కొనసాగిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆమె ఆశయ సాధనకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు సంసిద్ధం కావాలని అన్నారు. మేదరమెట్ల అనసూయమ్మ (తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు మేదరమెట్ల సీతారామయ్య సతీమణి) అనారోగ్యంతో మృతిచెందారు. శనివారం హైదరాబాద్‌లోని కొత్తపేట ఆర్‌కేపురం డివిజన్‌లో ఆమె కుమార్తె స్వగృహంలో అనసూయ భౌతికకాయానికి జాన్‌వెస్లీ, నేతలు ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ.. తన భర్త సీతారామయ్యతో కలిసి పేదల కోసం, దున్నేవాడికే భూమి కావాలని, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం జరిగిన నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనసూయమ్మ ముఖ్య పాత్ర పోషించారని చెప్పారు.

నాడు కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంపై అనేక నిర్బంధాలు.. ఆటుపోట్లు ఎదురైనప్పటికీ వెనకడుగు వేయకుండా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ప్రజల కోసం పనిచేశారని గుర్తుచేశారు. ధనిక కుటుంబంలో పుట్టినా పేద ప్రజల కోసమే పోరాడారని కొనియాడారు. ఆమె చివరి శ్వాస వరకు ఎర్రజెండా, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నమ్మారని, వారి పోరాట స్ఫూర్తిని మరింత ముందుకు కొనసాగించాలని పిలుపునిచ్చారు. సీతారామయ్య గ్రామ సర్పంచ్‌గా, కో- ఆపరేటివ్‌ బ్యాంకు చైర్మెన్‌గా కమ్యూనిస్టు యోధుడిగా సేవలందించారని కొనియాడారు. సూర్యాపేట జిల్లా గరిడిపల్లి మండలం వెల్దండ గ్రామానికి చెందిన సీతారామయ్య నాయకత్వంలో నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను పోరుబాటలో నడిపారని గుర్తుచేశారు.

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. అనసూయమ్మకు పేద ప్రజల పట్ల ఉన్న అంకితభావం, పోరాట చైతన్యం మరువలేనిదని చెప్పారు. ఆమె నిరంతరం కష్టజీవుల కోసమే పరితపించారని గుర్తు చేశారు. ప్రజా ఉద్యమాల్లో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారని, తన భర్త ఆచూకీ తెలపాలని ఆమెకు శిరోమండలం చేసి అవమానించినా భయపడకుండా ధైర్యంగా పార్టీ కోసం ఉద్యమంలో పనిచేసిన తీరు గర్వకారణమని అన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనసూయమ్మ భర్త సీతారామయ్య తోపాటు అనేక ఉద్యమాల్లో పాల్గొని మహిళలను చైతన్య పరిచారన్నారు.

సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం పోరాటాల్లో ముందు నిలిచిన ఆమె జీవితం నేటి తరానికి ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, సీపీఐ(ఎం) నాయకులు చంద్రమోహన్‌, వెంకన్న, జి.మనోహర్‌, కె.రాములు, ఎం.వీరయ్య, పారేపల్లి శేఖరావు, నాగారపు పాండు, పోటు కళావతి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, అనసూయమ్మ కుమార్తెలు, బంధువులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -