నవతెలంగాణ-హైదరాబాద్ : ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసులో మీడియా ప్రతినిధుల అరెస్టుపై సీపీ స్పందించారు. ‘‘మీడియా ప్రతినిధులు విచారణకు సహకరించాలి. నిందితులు ఎక్కడున్నా పట్టుకొస్తాం. ఓ టీవీ ఛానెల్ సీఈవో ఎక్కడ ఉన్నారు? పిలిస్తే.. విచారణకు రావాలి కదా. రిపోర్టర్లు ఎందుకు పారిపోతున్నారు. అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని బ్యాంకాక్ పారిపోయేందుకు ప్రయత్నిస్తేనే అదుపులోకి తీసుకున్నాం. మరో రిపోర్టర్ విచారణకు వస్తానని చెప్పి సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. అందుకే వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నాం.
త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం అంతా చట్ట ప్రకారమే చేస్తాం. చట్టం తనపని తాను చేసుకుపోతుంది. ప్రజా జీవితంలో విమర్శలు సహజం. విమర్శలు సహేతుకంగా ఉండాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా మహిళా అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం క్రూరత్వమే. మహిళలు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. మహిళా అధికారులపై అసత్య కథనాలు ప్రసారమైతే వాళ్లు సమాజంలో ఎలా పనిచేయగలుగుతారు. మహిళా అధికారులను కించపరుస్తూ వార్తలు ఎలా రాస్తారు. అందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలి.సీఎంపై అవమానకర వార్తలు వేయడంతో మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసులకు సంబంధించి సిట్ విచారణ జరుపుతోంది’’అని సీపీ తెలిపారు.



