Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంమూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

- Advertisement -

– హైదరాబాద్‌ ఆర్థిక భవిష్యత్‌కు అదే పునాది : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నదీ ప్రక్షాళన చేసి తీరుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఓ హోటళ్లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానర్స్‌ ఇండియా(ఐటీపీఐ) తెలంగాణ స్టేట్‌ రీజినల్‌ ఛాప్టర్‌ ఆధ్వర్యంలో ‘పాలసీస్‌ అండ్‌ స్ట్రాటజీస్‌ టూవార్డ్స్‌ బయోఫిలిక్‌ అర్బనిజం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ఆర్థిక భవిష్యత్‌కు మూసీ ప్రక్షాళనే పునాదని పేర్కొన్నారు. పర్యావరణం, సుస్థిరత లేకుండా ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదన్నారు. భవనాలను నిర్మించడమే అభివృద్ధి కాదనీ, ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణతో కూడిన వృద్ధి ఆవశ్యకమని నొక్కి చెప్పారు. మనం రూపొందించే విధానాలు, కాపాడే అడవులు, పునరుద్ధరించే నదులు, సృష్టించే ఉపాధి మొదలగు అభివృద్ధి పనులు తరాల మధ్య న్యాయానికి సంకేతాలని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం, కార్బన్‌ న్యూట్రల్‌ గ్రోత్‌, జల సంరక్షణ, సుస్థిర రవాణాలో తెలంగాణ అవలంబిస్తున్న విధానాలు, తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటే సుస్థిరాభివృద్ధితో కూడిన నగరాలను అభివృద్ధి చేయొచ్చని అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, వరదలు, పర్యావరణ కాలుష్యం, భూగర్భజలాల తరుగుదల, పట్టణీకరణ, తరిగిపోతున్న పచ్చదనం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నగర ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీపీఐ అధ్యక్షులు ఎన్‌కే.పటేల్‌, సెక్రెటరీ జనరల్‌ కుల్‌ శ్రేష, కో-ఆర్డినేటర్‌(టెక్నో అడ్మిన్‌) ప్రదీప్‌ కుమార్‌, ఐటీపీఐ తెలంగాణ రీజినల్‌ ఛాప్టర్‌ చైర్మెన్‌ ఎస్‌.దేవేందర్‌ రెడ్డి, కార్యదర్శి కె.మురళీధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad