Friday, January 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసిటీ పరిధిలో ఎక్కడికైనా వస్తాం

సిటీ పరిధిలో ఎక్కడికైనా వస్తాం

- Advertisement -

మాజీ సీఎం కేసీఆర్‌ను నేడు విచారణకు పిలిచిన సిట్‌
మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మరో తేదీ ఇవ్వాలన్న కేసీఆర్‌
నేడు నిర్ణయం తీసుకుంటాం : సిట్‌ అధినేత సజ్జనార్‌
కేసీఆర్‌కు నోటీస్‌పై రోజంతా హల్‌చల్‌
ఈ కేసు సిల్లీ విషయం : కేసీఆర్‌

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
గత రెండేండ్లుగా ఉత్కంఠ రేపుతున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసు దాదాపు పరాకాష్టకు చేరుకున్నది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సిట్‌ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. విచారణ జరపడానికి మీరు(కేసీఆర్‌) ఎక్కడికి పిలిచినా వస్తామని, అయితే విచారణ జరిపే స్థలం హైదరాబాద్‌ సిటీ పరిధిలోనే ఉండాలని అందులో స్పష్టం చేశారు. అయితే తాను మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం విచారణకు హాజరు కాలేననీ, మరో తేదీ నిర్ణయించాలంటూ కేసీఆర్‌ సిట్‌ అధికారులకు లేఖ పంపించారు. దీంతో ఈ విచారణ మరో మలుపు తిరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు కేసీఆర్‌కు సిట్‌ నోటీసు ఇచ్చిన వ్యవహారంపై ఇటు అధికారుల్లోనూ, అటు బీఆర్‌ఎస్‌ వర్గాల్లోనూ చర్చోపచర్చలకు దారి తీసింది. 2024లో మార్చిలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో వరుసగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుతో సహా ఐదుగురు పోలీసు అధికారులను సిట్‌ విచారించింది.

వీరి తర్వాత ఈ నెలలోనే 20, 23, 27 తేదీల్లో బీఆర్‌ఎస్‌ అగ్రనాయకులు హరీశ్‌రావు, కేటీఆర్‌, సంతోశ్‌రావులను సిట్‌ విచారించింది. వీరి విచారణలో తేలిన అంశాలు, గతంలో ఎస్‌ఐబీ ప్రభాకర్‌రావు మొదలుకొని ఇతర అధికారులతో సాగిన విచారణలో కేసీఆర్‌ పేరు ప్రస్తావనకు రావడంతో తాజాగా గురువారం బీఆర్‌ఎస్‌ చీఫ్‌కు సిట్‌ అధికారులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. నందినగర్‌లోని ఆయన నివాసానికి సిట్‌ ఏసీపీ వెంకటగిరి నోటీసు తీసుకెళ్లగా.. ఆ ఇంట్లో ఎవరూ లేరు. దీంతో అక్కడ ఉన్న కేసీఆర్‌ సహాయకుడికి నోటీసు
అందజేశారు. సెక్షన్‌ 160 ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాలని అందులో కేసీఆర్‌ను కోరారు. విచారణ జరపడానికి మీరు(కేసీఆర్‌) ఎక్కడికి పిలిచినా వస్తామని పేర్కొన్నారు. అయితే విచారణ జరిపే స్థలం హైదరాబాద్‌ సిటీ పరిధిలోనే ఉండాలని నోటీసులో స్పష్టం చేశారు.

ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు కేటీఆర్‌, హరీశ్‌రావు
కేసీఆర్‌కు సిట్‌ నోటీసు జారీ చేసిందన్న వార్తతో సిరిసిల్లలో ఉన్న ఆయన కుమారుడు కేటీఆర్‌, హైదరాబాద్‌లో ఉన్న హరీశ్‌రావులతో పాటు మరికొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు హుటాహుటిన ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు చేరుకొని కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సిట్‌ ఇచ్చిన నోటీసుపై ఏ విధంగా స్పందించాలి అని వారు ఒకపక్క మంతనాలు జరుపుతుండగా.. మరోపక్క కేసీఆర్‌ను ఎక్కడ విచారించాలన్న విషయమై సిట్‌ అధికారులు కూడా తర్జనభర్జన సాగించారు. ఒకదశలో నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలోనే విచారించాలనే యోచించిన సిట్‌ అధికారులు… అక్కడ భద్రతా వ్యవస్థ, ట్రాఫిక్‌ నియంత్రణపై సంబంధిత అధికారులు వెళ్లి చేపట్టాల్సిన చర్యలపై దృష్టిసారించారు.

65 ఏండ్ల వయస్సు దాటడం, మాజీ ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్ష నేత కావడంతో కేసీఆర్‌ను స్టేషన్‌కు పిలిచి విచారిం చడం సరికాదనీ, ఎక్కడ విచారించాలన్నది ఆయన నిర్ణయానికే వదిలేయాలని సిట్‌ అధికారులు నిర్ణయించారు. ఇక కేసీఆర్‌ నుంచి సమాచారం కోసం అధికారులు రాత్రి వరకు ఎదురు చూశారు. మరోవైపు సిట్‌ అధినేత సజ్జనార్‌ నేతృత్వంలో ఇతర అధికారులు కేసీఆర్‌ను ఏయే అంశాలపై విచారించాలనే విషయమై బంజా రాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌లో సమావేశమై చర్చించారు. కాగా రాత్రి 8 గంటల తర్వాత తాను శుక్రవారం విచారణకు హాజరు కాలేనంటూ సిట్‌ ఏసీపీ వెంకటగిరికి కేసీఆర్‌ నుంచి లేఖ అందింది.

నేడు(30న) మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ అనీ, ఆ రోజు తాను తన పార్టీ అభ్యర్థులకు ధ్రువపత్రాలను సంతకం చేసి అందించాల్సి ఉంటుందనీ, ఆ పనిలో బిజీగా ఉండటం వల్ల విచారణకు రాలేనని లేఖలో వివరించారు. మరోరోజు ఎప్పుడైనా పిలిస్తే విచారణకు హాజరవుతానని కేసీఆర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. తాను మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నేతను కావడం వల్ల చట్టాన్ని గౌరవిస్తానని అన్నారు. అలాగే తన చిరునామా నందినగర్‌గాక ఎర్రవెల్లిలో ప్రస్తుతం తానుంటున్న ఫాంహౌస్‌నే తన నివాసంగా గుర్తించి ఇకపై ఎలాంటి నోటీసులున్నా అక్కడికే పంపాలని అధికారులను కోరారు. ఇక విచారణను కూడా తన ఎర్రవెల్లిలోని నివాసంలోనే జరపాలనీ, సెక్షన్‌ 160 సైతం 65 ఏండ్లు దాటిన వ్యక్తులను వారు కోరుకున్న చోటే విచారించాలని చెప్తుందని కేసీఆర్‌ ఉదహరించారు.

మరో తేదీని నేడు నిర్ణయిస్తాం : సిట్‌ చీఫ్‌ సజ్జనార్‌
30వ తేదీన విచారణకు తాను హాజరుకాలేనంటూ కేసీఆర్‌ పంపిన లేఖ తమకు అందిందని సిట్‌ అధినేత, నగర పోలీసు కమిషనర్‌ వి.సి.సజ్జనార్‌ గురువారం రాత్రి వెల్లడించారు. ఈ విషయమై తాము సానుకూలంగా ఉన్నామనీ, శుక్రవారం తిరిగి కేసీఆర్‌ను ఏ రోజు విచారించేది నిర్ణయిస్తామని చెప్పారు. కాగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది.

ఈ కేసు సిల్లీ విషయం : కేసీఆర్‌
ఫోన్‌ట్యాపింగ్‌ అనేది అత్యంత సిల్లీ విషయమనీ, దీనిని గోరంతలు కొండంతలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2024లో ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ప్రతి రోజూ తెల్లవారుజామున ఇంటెలిజెన్స్‌ అధికారులు రాష్ట్రంలో పరిస్థితి గురించి సమాచారం ఇవ్వడం జరిగేదనీ, అందులో శాంతి భద్రతలు, నేరాలు, మావోయిస్టులు, సమాజంలో పరిస్థితి, ప్రభుత్వ అనుకూలత, వ్యతిరేకత తదితర అనేక అంశాలు వారి సమాచారంలో ఇమిడి ఉండేవని ఆయన తెలిపారు.

ఈ సమాచార సేకరణలో ఫోన్‌ట్యాపింగ్‌ జరపడమనేది సర్వసాధారణమనీ, కానీ వారు తాము ఈ సమాచారాన్ని ఎలా సేకరించామనేది చెప్పేవారు కాదు, నేను అడిగేవాడిని కాదు అని అన్నారు. ప్రధానమంత్రి మొదలుకొని ముఖ్యమంత్రుల వరకు గూఢాచార్య వ్యవస్థను పాలనలో భాగంగా ఉపయోగిం చుకోవడం సర్వసాధారణమనీ, ఈ నేపథ్యంలో ఫోన్‌ట్యా పింగ్‌ అంటూ ఈ ప్రభుత్వం గగ్గోలు పెట్టడం సిల్లీ విషయమనీ, తన ప్రతిష్టను దిగజార్చాలనే కుట్రతోనే కేసులంటూ వ్యవహారాలు సాగిస్తోందని ఆ సమయంలో కేసీఆర్‌ ఆరోపించారు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగానే సిట్‌ విచారణలో తాను చెప్పాల్సిన అంశాలకు కేసీఆర్‌ పదును పెడుతున్నారని తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -