కేసీఆర్ రూ. 8లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టి పోయారు
మార్చి 15నాటికి పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు భర్తీ
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం : మీడియాతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేసీఆర్‌లా కర్చిఫ్ వదిలేసినట్టు ప్రభుత్వ పథకాలను తాము వదిలేయబోమని, ఆరు గ్యారంటీల్లో.. మెజారిటీ అంశాలు ప్రజలకు అందుతున్నాయన్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ రూ.8 లక్షల కోట్లు అప్పు తమ నెత్తిన పెట్టిపోయినప్పటికీ.. తమ మంత్రివర్గ సభ్యలు ఉన్న నిధుల్లో చాలా చాకచక్యంగా స్కీంలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. తమ ప్రభుత్వానికి ఇంకా మూడేండ్ల సమయం ఉందనీ, హామీలన్నీ అమలు చేసి శభాష్ అనిపించుకుని, మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన రాష్ట్ర ముఖ్య నేతల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధివిధానాలను, రాజకీయంగా, ప్రభుత్వ పరమైన అన్ని అంశాలనూ రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మంత్రివర్గాన్ని హైకమాండ్ అభినందించినట్టు వివరించారు. వరి ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రభాగంలో ఉందని.. మిగతా పంటలను కూడా ప్రోత్సహించాలని ఖర్గే చెప్పారన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో అనుసరించాల్సిన అంశాలపై ఖర్గే సూచనలు చేశారని తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో ఈ భేటీ జరిగిందన్నారు. రాష్ట్ర మంత్రుల అభిప్రాయాలను పెద్దలు విన్నారని, అన్ని అంశాలపై తమకు దిశానిర్దేశం చేశారని మహేశ్ గౌడ్ తెలిపారు. అధిష్టానం వద్ద కాంగ్రెస్ మోకరిల్లిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలు, జాతీయ దృక్పథంతో పనిచేస్తాయని చెప్పారు. ప్రతి సారి మతం పేరుతో ప్రాంతం పేరిట రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ నేతలను హెచ్చరించారు.
మార్చి 15 వరకు పోస్ట్‌ల భర్తీ…
పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులను మార్చి 15నాటికి భర్తీ చేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున… పీసీసీ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, జిల్లా, బ్లాక్, బూత్ కమిటీలను పూర్తి చేస్తామన్నారు. అలాగే తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపైనా సమావేశంలో చర్చించినట్టు ఆయన చెప్పారు. అయితే.. రెండుమూడ్రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడిని పిలిచి చర్చిస్తామని అధిష్టానం చెప్పిందన్నారు. అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయంలో అధిష్టానం పెద్దలు త్వరలోనే ఆయనను ఢిల్లీకి పిలిపించి మాట్లాడతారని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్చా జరగలేదన్నారు. మంత్రివర్గ విస్తరణ ఉంటే సీఎం, హైకమాండ్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.



