రాష్ట్ర వ్యాప్తంగా భూ సేకరణకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తాం
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేసింది
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను 30నెలల వ్యవధిలో పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ జలసౌధలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్ట్‌లపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన రెండేండ్లలోనే ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టిందని వివరించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూసేకరణ, పునరావాస పనులకు గాను (జూన్ 2 నాటికి) రూ.5వేల కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కృష్ణా, గోదావరి రెండు బేసిన్లలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో అత్యధిక వరి పండిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను 90 శాతం పూర్తి చేశామంటూ గత పాలకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రూ.55 వేల కోట్ల ప్రాజెక్ట్‌లో రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తే అది 90 శాతం పూర్తయినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. వారి హయాంలో నే పాలమూరు అంచనాలను రూ.84 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి నీరివ్వలేదని ఆరోపించారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో ఆఫ్‌టేక్ పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల లిఫ్ట్ ఖర్చులు పెరిగి రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు.
ఇదే తరహాలో కాళేశ్వరం లిఫ్ట్ ఎత్తిపోతల పథకాన్ని తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై రూ.7,161 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి తెలిపారు. ఇందులో ప్రాజెక్ట్ పనులకు రూ.6,718 కోట్లు, భూసేకరణకు రూ.284.71 కోట్లు, పునరావాసానికి రూ.63.65 కోట్లు, ఇతర ఖర్చులకు రూ.94 కోట్లు వినియోగించినట్టు వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్ట్‌లను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 2014 జూన్ 2న ఎలా ఉన్నాయో 2024 జూన్ 2న కూడా అలాగే ఉన్నాయని చెప్పారు. ఎంత ఖర్చయినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించామని చెప్పారు. కల్వకుర్తికి రూ.909 కోట్లు, నెట్టేంపాడుకురూ.252 కోట్లు, భీమాకు రూ.200 కోట్లు, కోయిలసాగర్‌కు రూ.185 కోట్లు కేటాయింపులు జరిగాయని వివరించారు.
జూరాల ప్రాజెక్ట్ డీ సిల్టింగ్
జూరాల ప్రాజెక్ట్‌లో వెంటనే డీసిల్టింగ్ పనులు ప్రారంభించాలని నీటిపారుదల అధికారులకు మంత్రి సూచించారు. ప్రాజెక్ట్ రూపకల్పన సమయంలో దాని స్థూల నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలుగా ఉండగా, మట్టిపొరలు పేరుకుపోవడం వల్ల ప్రస్తుతం 9 టీఎంసీలకు తగ్గిందని తెలిపారు. 1995లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లో గత మూడు దశాబ్దాలుగా సహజంగా పేరుకుపోయిన మట్టి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రాజెక్ట్ నుంచి తవ్వి తీసే ఇసుకను గోదావరి పరివాహక ప్రాంతంలోని పనులకు ఉపయోగించే అవకాశాన్ని కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు. సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యాదాస్ నాథ్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
30 నెలల్లో పాలమూరు-రంగారెడ్డి పూర్తిచేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



