నవతెలంగాణ-హైదరాబాద్: జెన్ జెడ్ ఆందోళనలకు దారితీసిన వైఫల్యాలను సరిదిద్దుతానని నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కి శుక్రవారం స్పష్టం చేశారు. అవినీతిపై పోరాడతానని, ఉద్యోగాలు సృష్టిస్తామని, జీవన ప్రమాణాలను పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. 10 ఏళ్ల క్రితం ఇదే రోజు అమలులోకి వచ్చిన ప్రస్తుత రాజ్యాంగానికి గుర్తుగా శుక్రవారం నిర్వహిస్తున్న నేపాల్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సుశీల్ కర్కి మొదటి బహిరంగ సభ ఇది కావడం గమనార్హం.
ఉపాధి అవకాశాలను సృష్టించడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అవినీతి నియంత్రణ మరియు అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ నిరసనలు యువత ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయని, పెరుగుతున్న అవినీతిపై ప్రజల అవగాహన, అసంతృప్తి స్థాయిలను ప్రతిబింబిస్తాయని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సుపరిపాలన శ్రేయస్సును అందించే స్ఫూర్తి మరియు లక్ష్యాలను నెరవేర్చడంలో విఫలమైనందున ఆందోళను జరిగాయన్న వాస్తవాన్ని మనం అంగీకరించాలని అన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన సుశీలా కర్కి నేపాల్ ప్రధాని పదవిని చేపట్టిన ఏకైక మహిళ , నేపాల్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన మొదటి మహిళ కూడా.
ఈ నెల ప్రారంభంలో జెన్ జెడ్ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో కె.పి.శర్మఓలి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల్లో 72 మంది మరణించగా, 2,100 మందికి పైగా గాయపడ్డారు.