– మంత్రి పొన్నం ప్రభాకర్
– నిజామాబాద్ మేయర్‌గా ఉమారాణి బాధ్యతలు
– మోడల్ కార్పొరేషన్లుగా తీర్చిదిద్దుతాం : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్
నవతెలంగాణ-కంఠేశ్వర్
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలతో పాటు పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని, ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మేయర్‌గా కూరగాయల ఉమారాణి బాధ్యతల స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నగేష్‌రెడ్డి, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణతో కలిసి మంత్రి పాల్గొన్నారు. మేయర్‌గా ఉమారాణి, డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ప్రజల ఆలోచన మేరకు పార్టీ పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవడం తమ బాధ్యత అని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అభివృద్ధి తమ లక్ష్యమని తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లకు సమన్యాయం చేయాలని మేయర్‌కు సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిజామాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించారని, అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. 60 డివిజన్‌లలో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుకు సాగాలని తెలిపారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జిల్లాకు చెందిన టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో మున్సిపల్ కార్పొరేషన్లను మోడల్ కార్పొరేషన్లుగా తీర్చిదిద్దేలా ముందుకు సాగుతున్నామన్నారు. నగర అభివృద్ధే ధ్యేయంగా అన్ని రకాల నిధులు నిజామాబాద్‌కు వచ్చేలా కృషి చేస్తామన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొని మేయర్‌కు, డిప్యూటీ మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



