– రీసెర్చ్ పేపర్‌పై నిపుణులతో విశ్లేషణ చేయిస్తాం : మంత్రి జూపల్లి కృష్ణారావు
– అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై లోతుగా అధ్యయనం చేస్తాం
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇప్ప పువ్వు సారాపై చేసిన వ్యాఖ్యలు, అభిప్రాయాలపై లోతుగా అధ్యయనం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ విషయంపై అసెంబ్లీలో కూడా సమగ్రంగా చర్చిస్తామని వెల్లడించారు. ఇప్ప పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదని, ఇప్ప పువ్వుతో చేసే సారా తాగి గతంలో మన పూర్వీకులు వందేండ్లు బతికారని, బ్రిటిష్ పాలకులు వారి స్వార్థంతో నిషేధించిన ఇప్ప పువ్వు సారాను మళ్లీ తీసుకురావాలని, దీనివల్ల అటు ప్రభుత్వానికి, ఇటు గిరిజనులకు కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారి తీసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నూతన పురపాలక సంఘం భవన ప్రారంభానికి విచ్చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావును మీడియా ప్రతినిధులు అనిరుధ్ రెడ్డి ఇప్ప పువ్వుసారాపై చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్ప పువ్వు సారాపై అనిరుధ్ రెడ్డి చేసిన పరిశోధనా పత్రాన్ని తనకు ఇచ్చారని, దాన్ని నిపుణులకు ఇచ్చి విశ్లేషణ చేయిస్తామని తెలిపారు. ఇప్పపువ్వు సారాను అధికారికంగా విక్రయిస్తున్న రాష్ట్రాలు, ఇప్ప పువ్వు సారాను కంట్రీ లిక్కర్‌గా కాకుండా ఇండియన్ మేడ్ లిక్కర్‌గా అనుమతించిన గోవా గురించి కూడా ఎమ్మెల్యే తెలిపారని అన్నారు. అసెంబ్లీలో కూడా ఇప్ప పువ్వు సారాపై సమగ్రంగా చర్చిస్తామని, అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు.
రూ.4.33 కోట్లతో మున్సిపల్ ఆఫీస్ నిర్మాణం
జడ్చర్ల మున్సిపాలిటీలో రూ.4.33 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మున్సిపాలిటీ భవనాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జడ్చర్ల పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించడానికి ఆధునిక సౌకర్యాలతో ఈ నూతన భవనాన్ని నిర్మించామని చెప్పారు. ఈ భవనం ద్వారా ప్రజలకు పరిపాలనా సేవలు మరింత వేగంగా, సౌకర్యవంతంగా అందుబాటులోకి వస్తాయని అన్నారు.
ఇప్పపువ్వు సారాపై అసెంబ్లీలో చర్చిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



