భూ నిర్వాసితులకు అండగా బీఆర్‌ఎస్
అసెంబ్లీలో ప్రశ్నిస్తే..గొంతు నొక్కుతున్నారు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
వట్టినాగులపల్లిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటన
భూ కబ్జాపై బాధితులతో కలిసి ప్రెస్‌మీట్
నవతెలంగాణ-గండిపేట్
ప్రజలను బెదిరించి భూ కబ్జాలకు పాల్పడుతున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న కుంభ కోణాలను త్వరలో మరిన్ని బయటపెడతామని అన్నారు. మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షారెడ్డి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో భూ కబ్జా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యం లో సదరు భూమిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం సోమవారం పరిశీలించింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులపై బాధితులను అడిగి తెలుసుకుంది. అనంతరం బాధితుడు సతీష్ షాతో కలిసి కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి పేరుమీదనే ఆ భూమి ఉందన్నారు.
60ఏండ్లుగా ఈ భూమిలో వారు నివసిస్తున్నారని చెప్పారు. వట్టినాగులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువ భారీగా పెరిగిందని తెలిపారు. ఈ భూమి సుమారు రూ.1400 కోట్ల విలువ ఉంటుందని, దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నుపడిందన్నారు. మంత్రి, ఆయన కుమారుడు కలిసి స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్లి, భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారని ఆరోపించారు. అయితే సతీష్ షా కుటుంబం భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వడానికి గానీ, అమ్మడానికి గానీ సిద్ధంగా లేమని స్పష్టంగా మంత్రికి తెలిపిందని చెప్పారు. ఆ తర్వాత మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారని అన్నారు. తన రెవెన్యూ శాఖలోని శ్రీనివాసులు అనే అధికారి ద్వారా రూ.100 కోట్ల లంచం కేసులో పట్టుబడిన ఏడీతో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.
భూమిని ఇవ్వకపోతే, రెవెన్యూ సర్వే పేరుతో 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించినట్టు తెలిపారు. దీనికి లొంగకపోవడంతో హర్షా రెడ్డి, ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ గుండాలతో కలిసి, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేశారని గుర్తు చేశారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న కాంపౌండ్ వాల్‌ను కూడా ధ్వంసం చేసి, బాధితులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ ఘటన విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సతీష్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను అక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించి, రాత్రంతా నిలబెట్టారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను బదిలీ చేశారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోందన్నారు. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా, న్యాయ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన తమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. తమ గొంతు నొక్కుతున్నారని అన్నారు. బాధితులు సతీష్ షా మాట్లాడుతూ ఈ భూమి తమదేనని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కొత్వాల్‌గూడకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పర్యటన రద్దు
111 జీవో నిబంధనలకు విరుద్ధంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని కొత్వాల్‌గూడలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ నేతృత్వంలో రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో రద్దయింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సబితాఇంద్రారెడ్డితోపాటు పలువురు కొత్వాల్‌గూడ అక్రమ మైనింగ్ పరిసరాలను
పరిశీలించడానికి వస్తున్నట్టు మీడియా ద్వారా సమాచారం ఇచ్చారు. దాంతో ఉదయం పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చారు. దాంతో పోలీసులు భారీ బందోబస్తు అడుగడుగునా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన బీఆర్‌ఎస్ శంషాబాద్ మండల అధ్యక్షులు మంచర్ల మోహన్‌రావు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



