ఏపీ పార్టీల మద్దతుతోనే కేంద్ర సర్కారు మనుగడ
వచ్చే ఎన్నికల్లో యూపీలో ఎగిరేది ఎస్పీజెండానే : సదర్ సమ్మేళనంలో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఒక్కతాటిపైనే ఉన్నాయనీ, మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు కొనసాగిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు. ఏపీకి చెందిన పార్టీల మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు మనుగడ సాగిస్తోందన్నారు. ఆ రెండు పార్టీలు లేకపోతే మోడీ సర్కారు అధికారంలోకి వచ్చేది కాదని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యేల నివాస సముదాయంలో జరిగిన సదర్ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పలు పార్టీల నాయకులు వేదికపై ఉన్నప్పటికీ యాదవులందరూ ఒక్కటేనని చెప్పారు. భగవాన్ శ్రీకృష్ణుడి ఆశీస్సులు యాదవులందరిపైనా ఉంటాయన్నారు. యూపీ, ఏపీ నుంచి కూడా తమ పార్టీకి చెందిన నేతలు ఇక్కడకు వచ్చారని తెలిపారు.
రాజకీయాలకు అతీతమైన వేదిక ఇది అనీ, వేర్వేరు పార్టీలకు చెందిన వారమైనప్పటికీ, అందరం కూడా ఒక్కటేనని ప్రకటించారు. పెండ్లీండ్ల సందర్భంగా గుర్రపు బగ్గీపై కూర్చుని బరాత్‌లో పాల్గొనటం చూశాననీ, ఇప్పుడు ఇక్కడ గుర్రపు బగ్గీపై ప్రధాన వేదిక వద్దకు తనను తీసుకురావడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ ప్రత్యేకత ఉన్న నాయకుడనీ, అందుకే నన్ను బగ్గీపై ఊరేగించారని చమత్కరించారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో సాదరంగా ఆహ్వానం పలకడమే కాకుండా శ్రీకృష్ణ నినాదాలు చేయడం ఈ కార్యక్రమానికి మరింత శోభనిచ్చిం దన్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీని వెనక్కునెడు తున్నామనీ, వచ్చే ఎన్నికల్లో ఎస్పీ సారథ్యంలోని కూటమి జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ములాయం సింగ్ యాదవ్ తనను చిన్న వయస్సులోనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి సీఎంను చేశాడని కొనియాడారు. తనలాగే అనిల్ కుమార్ యాదవ్ కూడా చిన్న వయస్సులోనే రాజ్యసభ సభ్యుడయ్యారని ప్రశంసించారు.
నదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా ఆచరించడం సంతోషించదగ్గ విషయమని కితాబిచ్చాడు. అందుకు కృషి చేసిన అంజన్ కుమార్ యాదవ్, ఇతర నేతలను ఆయన అభినందించారు. సదర్ ఉత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమ్మేళనానికి వేలాదిగా జనం హాజర య్యారనీ, ఇంకా ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, నాంపల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జి ఫిరోజ్ ఖాన్, పీసీసీ మాజీ అధ్యక్షులు వీహెచ్, టీపీసీసీ నేత గౌరీ యాదవ్, యాదవ సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, బతుకమ్మ ఆటపాటలు, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు, ఉత్తరాది డ్రమ్స్ ప్రదర్శన తో అఖిలేశ్ యాదవ్‌ను అంజన్‌కుమార్, అనిల్ కుమార్‌యాదవ్, వీహెచ్, తదితరులు స్వాగతించారు. గుర్రపు బగ్గీపై ఊరేగింపుగా వేదికవద్దకు తీసుకెళ్లారు. ఏకేవై పేరుతో యువత హల్‌చల్ చేసింది. దున్నపోతుల ప్రదర్శనను చేసింది. సభలోకి పట్టుకొచ్చిన చిన్న దూడ అందర్నీ ఆకట్టుకున్నది.



