కార్యకర్తలకు అండగా ఉంటాం స్థానిక పోరు తర్వాత సభ్యత్వ నమోదు
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధంకండి : జూబ్లీహిల్స్ సమీక్షా సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పార్టీ నిర్మాణంపై దృష్టిపెడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) అన్నారు. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడినందున అందరిలోనూ నిరూత్సాహం ఉందన్నారు. ఓడిన చోటే గెలిచి చూపించాలని అన్నారు. దొంగ ఓట్లు, అక్రమాలతోనే కాంగ్రెస్ గెలిచిందని వివరించారు. త్వరలో రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ సమీక్ష సమావేశాన్ని కేటీఆర్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ పనిచేశారని అన్నారు. రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం తామకాలికి బలపం కట్టుకుని తిరుగుతామని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. కర్ణాటక నుంచి మనుషులను తెచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారని అన్నారు. షేక్‌పేట, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో రిగ్గింగ్ చేశారని చెప్పారు.
పోలీసులను అడ్డం పెట్టుకుని, డబ్బు, మద్యం పంచి గెలిచారని వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. డిసెంబర్‌లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని వివరించారు. ఆ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామన్నారు. జూబ్లీహిల్స్‌లోని 407 బూత్‌లలో ఒక్కో బూత్‌కు 10 మంది చొప్పున, మొత్తం నాలుగు వేల మందితో పటిష్టమైన సైన్యాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి”అనే సామెతను గుర్తు చేస్తూ ఓడిన చోటే గెలవాలని అన్నారు.
నైతిక విజయం బీఆర్‌ఎస్‌దే : హరీశ్‌రావు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నైతిక విజయం బీఆర్‌ఎస్‌దేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీశ్‌రావు చెప్పారు. ఈ ఫలితాలపై బీఆర్‌ఎస్ నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదనీ, పోరాటస్ఫూర్తితో పనిచేశామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 18 వేల ఓట్లు మాత్రమే బీఆర్‌ఎస్‌కు వచ్చాయనీ, ఈ ఉపఎన్నికల్లో 75 వేల ఓట్లు సాధించడం కార్యకర్తల కృషికి నిదర్శనమని వివరించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లోనూ తాత్కాలికంగా ఓటమి ఎదురైనా, ఆ తర్వాత గెలిచామని గుర్తు చేశారు. త్వరలోనే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. తమను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, పోలీసుల జోక్యం, విచ్చలవిడి డబ్బు పంపిణీ ఫలితాన్ని ప్రభావితం చేశాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాబోయే రెండేళ్ల తర్వాత బలమైన ‘తుపాన్’ వస్తుందనీ, అప్పుడు కాంగ్రెస్ ఉనికి ఉండదని ఆయన జోస్యం చెప్పారు.
పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



