Thursday, January 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఫాలోఅప్‌ చేస్తాం

ఫాలోఅప్‌ చేస్తాం

- Advertisement -

హైదరాబాద్‌లో డబ్ల్యూఈఎఫ్‌ పెట్టుబడుల కొనసాగింపు సదస్సు
ఏటా జులైలో నిర్వహణ : దావోస్‌ ‘జాయిన్‌ ది రైజ్‌’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదన
ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన బిజినెస్‌ లీడర్స్‌
అదే వేదికపై తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ ఆవిష్కరణ
వాణిజ్య సదస్సులో సీఎంతో సినీ నటుడు చిరంజీవి భేటీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌)లో జరిగే ఒప్పందాల అమలు కోసం ఇకపై ఏటా హైదరాబాద్‌లో ఫాలో-అప్‌ సదస్సులు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏటా జులై మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని దావోస్‌ వేదికగా బుధవారం జరిగిన ‘జాయిన్‌ ది రైజ్‌’ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు గ్లోబల్‌ బిజినెస్‌ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రస్తుతం పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని అన్నారు. అందుకే ప్రతీ యేడాది జులై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ఫాలో-అప్‌ సదస్సు నిర్వహించాలని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ప్రతినిధులకు ఆయన సూచించారు.

హైదరాబాద్‌లో తొలి బ్యూటీ-టెక్‌ జీసీసీ
కాగా ప్రపంచంలోనే తొలి బ్యూటీ-టెక్‌ గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని లోరియల్‌ సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభించనుంది. దావోస్‌లో జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డితో లోరియల్‌ సీఈవో నికోలస్‌ హియోరోనిమస్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులతో బ్యూటీ-టెక్‌ జీసీసీని ఏర్పాటు చేసే నిర్ణయాన్ని ఆయన వెల్లడించారు. ఈ ఏర్పాటుతో లోరియల్‌కు గ్లోబల్‌ ఇన్నోవేషన్‌, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్‌ కార్యకలాపాలకు హైదరాబాద్‌ కీలక కేంద్రంగా మారనుంది. డిజిటల్‌ ట్రాన్ఫర్మేషన్‌, ఏఐ, అనలిటిక్స్‌ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్‌ యూనిట్లకు అందిస్తామని హియెరోనిమస్‌
ఈ సందర్భంగా తెలిపారు. దీంతో గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజ్‌ కార్యకలాపాలకు హైదరాబాద్‌ ప్రాముఖ్యత మరింత పెరుగనుంది. నవంబర్‌లో జీసీసీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రితోపాటు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును లోరియల్‌ సంస్థ ఆహ్వానించింది.

హైదరాబాద్‌ పెట్టుబడులకు అనువైన ప్రదేశమని శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా చెప్పారు. మెడ్‌టెక్‌, హెల్త్‌టెక్‌ మాత్రమే కాకుండా బ్యూటీ-టెక్‌ వంటి కొత్త విభాగాల్లోనూ తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే మారియెట్‌, వ్యాన్‌ గార్డ్‌, నెట్‌ ఫ్లిక్స్‌, మెక్‌ డోనాల్డ్స్‌, హినెకెన్‌, జాగర్‌, కోస్ట్కో వంటి గ్లోబల్‌ కంపెనీలు హైదరాబాద్‌లో జీసీసీలను ఏర్పాటు చేశాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌ గురించి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా డబ్ల్యూఈఎఫ్‌ ప్రతినిధులకు వివరించింది. జీసీసీతోపాటు మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు రాష్ట్రంలోగల అవకాశాలను పరిశీలించాలని లోరియల్‌ సంస్థ విభాగాధిపతులను వారు ఆహ్వానించారు. తెలంగాణలో ఉన్న మౌలిక వసతులు, పరిశ్రమల ఎకోసిస్టమ్‌ను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో తయారీ రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు హియెరోనిమస్‌ ఈ సందర్భంగా హామీనిచ్చారు.

బ్లైజ్‌ కంపెనీ ఒప్పందం
మరోవైపు కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సంస్థ వ్యవస్థాపక సీఈవో దినాకర్‌ మునగాలా సీఎంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డేటా సెంటర్‌ అర్టిఫిషియల్‌ కంప్యూటింగ్‌కు ఈ సంస్థ తక్కువ శక్తిని వినియోగించే హార్డ్‌వేర్‌, ఫుల్‌-స్టాక్‌ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయనుంది. బ్లైజ్‌ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది. తన ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను విస్తరించేందుకు వీలుగా పెట్టుబడులు, ప్రణాళికలపై ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు సీఎంతో చర్చించారు. హెల్త్‌కేర్‌ డయాగస్టిక్స్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆటోమేషన్‌, ఎనర్జీ ఎఫిషియెన్సీ వంటి రంగాల్లో ఏఐ ద్వారా పరిష్కారాలను కనుగొనటం, వాటిని పైలట్‌ ప్రాజెక్టులుగా అమలు చేసేందుకు ఉండే అవకాశాలపై వారు సమాలోచనలు చేశారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ… తెలంగాణను ఏఐ డేటా సెంటర్‌ హబ్‌గా తీర్చిదిద్దటమనేది వచ్చే రెండు దశాబ్దాల్లో మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్‌, హార్డ్‌వేర్‌, ఆటోమేషన్‌ రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. దేశంలోనే టెక్నాలజీ హబ్‌గా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. బ్లైజ్‌ సంస్థకు సంబంధించిన ఆర్‌ అండ్‌ డీ యూనిట్‌ విస్తరణకు ప్రభుత్వం తగిన మద్దతునిస్తుందని హామీనిచ్చారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతమైందని వివరించారు. రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తమ ప్రభుత్వం ఆకర్షించిందని చెప్పారు. ‘ప్రతీ యేడాది మేము ఎంవోయూలపై సంతకాలు చేయడానికి దావోస్‌కు వస్తాం.. కానీ ఈసారి గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతం కావటంతో, తెలంగాణ రైజింగ్‌ విజన్‌, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చాం” అని తెలిపారు. హైదరాబాద్‌ గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన కేంద్రంగా మారిందని వివరించారు.

మూసీ నది పునరుజ్జీవనంతోపాటు రివర్‌ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయటం ద్వారా నైట్‌ టైమ్‌ ఎకానమీపై దృష్టి సారిస్తామని చెప్పారు. తద్వారా దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా 30 వేల ఎకరాల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఇందులో 50 శాతం కంటే ఎక్కువ గ్రీన్‌ కవర్‌ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యాలను ప్రదర్శించారు. అదే వేదికపై తెలంగాణ ఇన్నోవేషన్‌ హబ్‌ తెలంగాణ నెక్ట్స్‌-జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీలను ఆవిష్కరించారు. సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి… హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణ, చెరువులు, కుంటల పునరుజ్జీవనం వంటి గేమ్‌-చేంజర్‌ ప్రాజెక్టులను వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన కోర్‌, ప్యూర్‌, రేర్‌ అర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను ప్రస్తావించారు. తెలంగాణకు అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, సాంకేతికత, అనుభవం, నైపుణ్యాలపరంగా గ్లోబల్‌ కంపెనీల సహకారం స్వీకరిస్తామని వారు తెలిపారు.

రూ.6 వేల కోట్లతో రియాక్టర్‌ విద్యుత్‌ ప్లాంట్‌
కాగా క్లీన్‌ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్‌ (ఎస్‌ఎంఆర్‌) ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ ముందుకొచ్చింది. సీఎం రేవంత్‌ రెడ్డితో ఆ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈఓఐ)ను సమర్పించింది. స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్‌, భారత్‌కు చెందిన గ్రీన్‌ హౌస్‌ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లర్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ ఏర్పడింది. గరిష్ఠంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను ఆ సంస్థ పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ మొత్తం పెట్టుబడి విలువ 600 మిలియన్‌ యూరోలు (సుమారు రూ.6,000 కోట్లు). ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందన్నారు. 2047 నాటికి నెట్‌–జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో సుస్థిర అభివృద్ధే ప్రధానమని తెలిపారు.

రూ.వెయ్యి కోట్ల పెట్టుబడికి సర్గాడ్‌ ఎంవోయూ
విమానయాన రంగంలో పేరొందిన అమెరికా సంస్థ సర్గడ్‌.. మన రాష్ట్రంలో మెయింటెనెన్స్‌ అండ్‌ రిపేర్‌ యూనిట్‌ నెలకొల్పనుంది. రాబోయే మూడు నుంచి ఐదేండ్లలో దశలవారీగా రూ.వెయ్యి కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా దావోస్‌లో, సర్గాడ్‌ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీనివాస్‌ తోట ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డితో భేటీ అయి… ఈ మేరకు ఒప్పందాలు చేసుకున్నారు. తెలంగాణలో విమానాల నిర్వహణ, మరమ్మతులు, వాటి పునరుద్ధరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని సంస్థ ప్రతినిధులు వ్యక్తం చేశారు.

‘శంకర వరప్రసాద్‌ గారూ…’ సూపర్‌…
ప్రముఖ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన తన కుటుంబంతో కలిసి కొద్ది రోజుల క్రితం స్విట్జర్లాండ్‌కు వెళ్లారు. ప్రస్తుతం చిరు అక్కడే ఉన్నారన్న విషయం తెలుసుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి… ‘ఇక్కడే ఉన్నారుగా.. ఒక్కసారి దావోస్‌కు రండి…’ అంటూ ఆహ్వానించారు. దీంతో చిరంజీవి డబ్ల్యూఈఎఫ్‌ సదస్సుకు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం, చిరు పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. ఇటీవల విడుదలైన ‘మన శివశంకర వరప్రసాద్‌ గారు’ సినిమాను తాను కుటుంబంతో కలిసి వీక్షించానని సీఎం చెప్పారు. ఆ సినిమాను ఎంతో ఆస్వాదించానని తెలిపారు. ఆ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో సీఎం, చిరంజీవికి అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -