Friday, July 18, 2025
E-PAPER
Homeజాతీయంస్థానికంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం

స్థానికంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం

- Advertisement -

– దానికీ వ్యూహం ఉంది
– గంజాయి బ్యాచ్‌ వ్యాఖ్యలు పట్టించుకోం
– కేసీఆర్‌ తెలంగాణ ద్రోహి
– లోకేష్‌తో కేటీఆర్‌ ఎందుకు భేటీ అయ్యారు?
– బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నించాలి : ఢిల్లీ మీడియాతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విజయాన్ని సహించలేని వాళ్ళు ఎస్సీ వర్గీకరణ, కుల గణన సర్వేపై కూడా ఇలాంటి విమర్శలే చేశారని గుర్తుచేశారు. కానీ వారి అంచనాలకు మించి అన్నింటినీ విజయవంతంగా చేసి చూపించామని చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్‌ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. దానికోసమే 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ తెస్తున్నామన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలు రాయడం కాదనీ, తెలంగాణ అభివృద్ధి అంశాలపై ఎజెండా పెట్టుకొని పిలిస్తే మంత్రులు, అధికారులను పంపిస్తామనీ, అవసరమైతే తాను, డిప్యూటీ సీఎం కూడా వెళ్తామని చెప్పారు. ఇది ఫెడరల్‌ వ్యవస్థని మేం ముందునుండి చెబుతున్నామనీ, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని అన్నారు.


అక్కడ చేసి, ఇక్కడకు రండి
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌, ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపించిన మహారాష్ట్రలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మొదట ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించి, కేంద్రమంత్రులు బండి సంజరు, కిషన్‌రెడ్డి తెలంగాణలో రిజర్వేషన్లపై మాట్లాడాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.

నీటి కోసం రోడ్‌మ్యాప్‌
తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ భవిష్యత్‌ నీటి అవసరాల కోసం స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ తమదగ్గర ఉన్నదని రేవంత్‌రెడ్డి తెలిపారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లో ఉన్నవి, కొత్తగా చేపట్టే ప్రాజెక్ట్‌ లు, నీటి కేటాయింపులు సహా అన్నింటినీ, ఇకపై నూతన కమిటీ చూస్తుందని తెలిపారు. ఈ కమిటీలో పరిష్కారంకాని అంశాలను సీఎంల స్థాయిలో చర్చిస్తామన్నారు. ఇచ్చంపల్లి-కావేరి వయా శ్రీశైలం నదుల అనుసంధానం అంశం కేంద్రం ప్రతిపాదించిం దని చెప్పారు. ‘మేం ఇంజనీర్లం కాదు. రాజకీయ కార్యనిర్వాహకులం. సాంకేతికంగా, చట్టాలు అనుమతిస్తే ముందుకెళ్తాం. భవిష్యత్‌ అవసరాలు, సమాజంలో మార్పులు, సాంకేతికతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాం’ అని చెప్పారు.

తెలంగాణ ద్రోహి కేసీఆర్‌
బీఆర్‌ఎస్‌ హయాంలో కృష్ణా బేసిన్‌లో ఏపీకి 4.1 టీఎంసీలు ఉంటే, రాయలసీమకు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ద్వారా 9.6 టీఎంసీలను మళ్లించారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2004-2014 కాంగ్రెస్‌ హయాంలో రాయలసీమకు 728 టీఎంసీలు పోతే, 2014-23 వరకు 1,200 టీఎంసీలు తరలించారని గుర్తుచేశారు. కేసీఆర్‌ తెలంగాణ ద్రోహి అనడానికి ఇది సరిపోతుంది. ఇప్పుడు రాయలసీమకు నీళ్లు ఆపి, శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ఆపేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుచేస్తున్నట్లా? దీనిపై కేంద్రం, ఏపీతో చర్చకు పోకపోతే, ఎర్రవల్లి ఫాం హౌస్‌కు పోవాలా? అని ఎద్దేవా చేశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో అప్పట్లో రెండుసార్లు కేసీఆర్‌, హరీశ్‌రావులు పాల్గొన్నారు. ఇప్పుడు మేం పాల్గొన్నాం.దీంటో తప్పేముంది?

లోకేశ్‌తో కేటీఆర్‌ భేటీలో ఆంతర్యమేంటి?
తాను ఏపీ సీఎంతో అధికారికంగా చర్చలో పాల్గొంటే తప్పుబడుతున్న కేటీఆర్‌, అసలు ఆ రాష్ట్ర మంత్రితో చీకిటి భేటీలో ఎందుకు పాల్గొన్నారు? హైదరాబాద్‌లో మూడు సార్లు లోకేశ్‌తో కేటీఆర్‌ భేటీ కావడం వాస్తవం కాదా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు తప్పుపట్టట్లేదు. ఈ విషయంలో ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం మాకేం లేదు.

హైకోర్టు నేతృత్వంలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకొని మానిటరింగ్‌ చేస్తోందని సీఎం చెప్పారు. గతంలో కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రిగా తన ఫోన్‌ ట్యాప్‌ అయిందన్న కిషన్‌రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రస్తుతం ఈ కేసులో కేసీఆర్‌ను కాపాడేందుకే కేంద్రానికి ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. ‘కేంద్ర విదేశాంగ శాఖ, ఇతర శాఖల వల్లే ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్‌రావును తీసుకురావడంలో ఏడాదిన్నర ఆలస్యమైందన్నారు.

బీజేపీది స్వార్థం
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును కేంద్రానికి అప్పగించాలని కోరుతున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తెలంగాణలో కీలక కేసులన్నీ ఈడీకి అప్పగిస్తే ఏం చేసిందని ప్రశ్నించారు. గొర్రెల స్కీం, ఈ ఫార్ములా రేసు సహా ఇతర కేసులన్నింటిని ఈడీ దర్యాప్తు చేస్తోందన్నారు. ఈ కేసులకు సంబంధించి అడిగిన అన్ని వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించామని చెప్పారు. అయినా… ఇప్పటికీ కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్‌ చేయలేదన్నారు. కాళేశ్వరం ఇంజనీర్ల అక్రమ సంపాదన ఏంటనేది ఏసీబీ దాడులతో ప్రజలకు అర్థమవుతున్నదని అన్నారు.

కొట్లాట చివరి అస్త్రం
కొట్లాట నా చివరి అస్త్రం. ఇదే ధోరణిలో కేంద్రం, పొరుగు రాష్ట్రం ఏపీతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం. కొట్లాడుకుంటూ పోతే ప్రజలకు నష్టం. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఆ వివరాలు వెల్లడించారు.

గంజాయి బ్యాచ్‌కు నేను స్పందించాలా…?
కేటీఆర్‌ది గంజాయి బ్యాచ్‌. ఆ బ్యాచ్‌ సవాల్‌ విసిరితే నేను స్పందించాలా? అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘కేటీఆర్‌ బిజినెస్‌ భాగస్వామి కేదార్‌ రకరకాల డ్రగ్స్‌ ఒకేసారి తీసుకొని దుబాయ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను తెప్పించాం. త్వరలో బయట పెడతాం. కేటీఆర్‌ బామ్మర్ది ఫాంహౌజ్‌లో గంజాయి, డ్రగ్స్‌తో దొరికాడు. ఇలా కేటీఆర్‌ చుట్టు పక్కన ఉన్న వాళ్లంతా గంజాయి బ్యాచ్చే.. టెస్టుల కోసం రక్తం, జుట్టు ఇస్తా అని సవాల్‌ విసిరిన కేటీఆర్‌ మాటమార్చి కోర్టుకు పోయి ఆర్డర్స్‌ తెచ్చుకున్నాడు అని ఎద్దేవా చేశారు.
‘కేసీఆర్‌ మా రాజకీయ ప్రత్యర్థి, ఆయన ప్రతిపక్ష నేతగా చేయాల్సింది చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ వస్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధం’. అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు అవినీతి అంశాలను ప్రస్తావించారు.

బీసీల రిజర్వేషన్లు తగ్గించింది కేసీఆరే…
2014కు ముందు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్‌ కల్పిస్తే, దాన్ని 23 శాతానికి తగ్గించింది కేసీఆరే అని ఆరోపించారు. బీజేపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కే లక్ష్మణ్‌కే ఈ బిల్లు, ఆర్డినెన్స్‌పై అవగాహన లేదన్నారు.

త్వరలో మహారాష్ట్ర పర్యటన
రాష్ట్ర ప్రయోజనాల కోసం త్వరలో మహారాష్ట్రకు వెళ్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తుమ్మిడి హట్టి ప్రాజెక్ట్‌ కోసం మహారాష్ట్రలో పర్యటిస్తాననీ, అక్కడి ప్రభుత్వంతో మాట్లాడతామనీ అన్నారు.

కేటీఆర్‌ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవట్లేదు
కేసీఆర్‌ ఫ్యామిలీలో ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేటీఆర్‌ నాయకత్వాన్ని కవితే ఒప్పుకోవడం లేదన్నారు. ఇండ్లలోనే వాళ్లకు విలువలేదనీ, ఇక ప్రజలకు ఏం చెప్తారని ఎద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -