రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య
నవతెలంగాణ – ముషీరాబాద్
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబంపై దాడి చేసిన అగ్రకుల పెత్తందారులను కఠినంగా శిక్షించాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రజక అభివృద్ధి సంఘం రాష్ట్ర వైస్ చైర్మెన్ ఎం నరసింహ అధ్యక్షతన రజక సంఘాల అధ్యక్ష కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ. అగ్రకుల పెత్తందారుల ధన దాహానికి కుమ్మెర గ్రామంలో రజక కుటుంబంలో చిన్నారి మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక మరణానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
లేనిపక్షంలో అన్ని జిల్లా కేంద్రాలు, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో నల్ల జెండాలతో ధర్నాలు, నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక అభివృద్ధి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి రాజశేఖర్, మన రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొల్లంపల్లి వెంకట రాములు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి అధ్యక్షులు గోపి, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసల సంపత్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ పెద్దాపురం భాస్కర్, రజక రిజర్వేషన్ సమితి అధికార ప్రతినిధి ముత్యాల నర్సింగ్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్, దొడ్డిపల్లి రఘుపతి, తదితర నాయకులు పాల్గొన్నారు.



