– కేజీ కేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – వలిగొండ రూరల్ : కల్లుగీత కార్మిక సంఘం 4 వ రాష్ట్ర మహాసభలు పోరాటాల పురిటి గడ్డ సూర్యాపేట పట్టణంలో నవంబర్ 28, 29, 30 తేదీలలో నిర్వహిస్తామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు అన్నారు. మొదటిరోజు వేలాదిమంది గీత కార్మికులతో ప్రదర్శన, బహిరంగ సభ ,2 రోజులు ప్రతినిధుల సభ నిర్వహిస్తామని దీనికి రాష్ట్ర వ్యాప్తంగా హాజరవుతారని వీటిని జయప్రదం చేయాలని గీత కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం వలిగొండ మండల కేంద్రంలో లక్ష్మీ గణేష్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కమిటీ సభ్యు లు మద్దెల రాజయ్య అధ్యక్షతన జరిగిన మండల మహాసభ లో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
స్వయం పోషకంగా బతుకుతున్న లక్షలాదిమంది గీత కార్మికుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.కల్లుగీత సొసైటీలను బలోపేతం చేయాలని అన్నారు. వృత్తిలో ఉపాధి మెరుగుపడాలంటే చెట్ల పెంపకానికి భూమి ఇవ్వాలని, నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, మార్కెట్ సౌకర్యం కల్పించాలని అందుకు తగిన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. వీటి అమలుకు బలమైన ఉద్యమాలు నిర్మించేందుకు రాష్ట్ర మహాసభ ల లో రూపకల్పన చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. అధికారులకు, మంత్రులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4 వేలకు, ఎక్సిగ్రేషియా 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రమాద నివారణకు వృత్తి చేసే వారందరికీ జాప్యం లేకుండా కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని అన్నారు. ప్రమాదానికి గురైన గీత కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఎక్సిగ్రేషియా 12 కోట్ల 60 లక్షలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహాసభలలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి ఆర్థిక, సామాజిక, సంస్కృతిక రంగాలలో అభివృద్ధి సాధించేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాగిరి కృష్ణయ్య, బోలగాని జయరాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు, పల్సం స్వామి, పబ్బతి మల్లేశం రేకల లక్ష్మీనారాయణ, జువగాని శ్రీకాంత్, తూర్పునూరి శంకరయ్య, మద్దెల మారయ్య, పల్చ మచ్చ గిరి, మల్లేశం నారగోని అశోక్, లోడై మల్లేశం, మెరుగు మహేష్ తదితరులు పాల్గొన్నారు.