– జెఏసి నాయకులు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్.
నవతెలంగాణ – ఊరుకొండ
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఊరుకొండ మండలాన్ని జడ్చర్ల నియోజకవర్గంలో కలుపుకుంటూ జడ్చర్లను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తానని స్థానిక జడ్చర్ల ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా పలికిన వ్యాఖ్యలను బే షరతుగా వెనక్కి తీసుకోవాలని.. లేని పక్షంలో ఊరుకొండ అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జెఏసి నాయకులు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ హెచ్చరించారు. శనివారం ఊరుకొండ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ప్రధాన రహదారిపై అఖిలపక్ష జేఏసీ ఆద్వర్యంలో ఊరుకొండ మండలాన్ని కల్వకుర్తి డివిజన్ లోనే కొనసాగించాలి.. కల్వకుర్తి తాలూకాను నూతన జిల్లాల ప్రకటించాలి.. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఎనిమిది రోజులుగా వినూత్న రీతిలో కొనసాగుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఏమాత్రం స్పందించడం లేదని.. ప్రజాభిప్రాయాన్ని స్వీకరించకుండా తన స్వార్థ రాజకీయాల కోసం అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకుండా మొండిగా వ్యవహరించడం హేయమైన చర్య అని వారు విమర్శించారు.
తాము వివిధ డిమాండ్ లతో ఊరుకొండ అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు అనుకున్నది సాధించేవరకు విరమించేది లేదని వారు తేల్చి చెప్పారు. రిలే దీక్షలకు కల్వకుర్తి తాలూకా జేఏసీ చైర్మన్ కానుగుల జంగయ్య, జేఏసీ నాయకులు సదానందం గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు కుడుముల శ్యాంసుందర్ రెడ్డిలు తమ పూర్తి మద్దతు తెలపడంతో పాటు.. ఉద్యమానికి తాము సైతం సై అంటున్నామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కల్వకుర్తి తాలూకా అఖిలపక్ష జేఏసీ చైర్మన్ కానుగుల జంగయ్య, జేఏసీ నాయకులు సదానందం గౌడ్, తాడెం చిన్న, బొల్గం నరేందర్ గౌడ్, బుడుమ జంగయ్య, రాజనారం రెడ్డి, పాయ్యావుల జంగయ్య, వాగుల్ దాస్ లావణ్య, యాదగిరి, బండారి శివుడు, డాన్ శివ, లాలు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.



