Friday, March 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురైతును రాజును చేస్తాం

రైతును రాజును చేస్తాం

- Advertisement -

22 నుంచి రైతు భరోసా
త్వరలో సాదాబైనామాలపై నిర్ణయం : ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
పంచాంగాన్ని ఆవిష్కరించిన సీఎం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 22న రైతుభరోసా నిధులను విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక, దేవాదాయ, ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. బాచంపల్లి సంతోష్‌కుమార్‌ పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఈ తెలుగు నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరమని పేర్కొన్నారు.

రైతు సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ”రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది. తెలంగాణలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి. అందుకే రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. ఇప్పటి వరకు తమ సర్కార్‌ రైతుభరోసా కోసం రూ.18 వేల కోట్లు ఖర్చు చేసింది. రైతులకు సబ్సిడీ ఎరువులు, పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్‌, ఉచిత విద్యుత్‌, రైతు బీమా లాంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నాం” అని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. రైతుల విషయంలో అతి తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఇటీవల కేంద్రం ప్రకటించడం మనకు గర్వకారణమన్నారు.

ధరణి భూతాన్ని తరిమేసి భూ భారతితో భూసమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. గత సర్కార్‌ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాలపై తమ ప్రభుత్వం త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుందనీ, అవి రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్టు సీఎం తెలిపారు. అనంతరం ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్న వివిధ ప్రాంతాలకు చెందిన అర్చకులను సీఎం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌గౌడ్‌, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ ఏనుగు నర్సింహరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్‌ హన్మంతరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మెన్లు, అధికారులు పాల్గొన్నారు.

దక్షిణాది ముఖ్యమంత్రులు తస్మాస్‌ జాగ్రత్త : ప్రముఖ పంచాంగకర్త బాచంపల్లి సంతోశ్‌ కుమార్‌
పరాభవ నామ సంవత్సరం పేరు వినగానే భయపడాల్సిన పని లేదనీ, అధర్మాత్ములకు పరాభవం, ధర్మాత్ములకు ప్రాభవమే పరాభవ నామసంవత్సరం అని ప్రముఖ పంచాంగకర్త బాచంపల్లి సంతోశ్‌ కుమార్‌ అన్నారు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఆధిపత్యం కోసం పోరాటాలు జరుగుతాయనీ, పరిపాలనలో రాజుకు మంత్రులకు మధ్య పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఆధిపత్యాన్ని కోరుకునే వారు ఎక్కువవుతారనీ, అయితే ధర్మంగా ఉన్నవారు మాత్రమే విజయం సాధిస్తారని చెప్పారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో నదులు పుష్కలంగా ప్రవహించడం ద్వారా రాష్ట్రం పాడి పంటలతో పచ్చగా ఉంటుందన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు.

నొసట చిరునవ్వులు చిందించినా లోపల మరో రకంగా ఉంటుందని అందువల్ల పాలకులు నిత్యం సయోధ్యతో ఉండాలని సూచించారు. అతిగా మాట్లాడకుండా, మౌనం వహించడం మంచిదని సూచించారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసే నాయకులకు అందరూ పట్టం కడతారని చెప్పారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది గతేడాది కంటే రియల్‌ ఎస్టేట్‌ రంగం మెరుగుపడబోతోందని చెప్పారు. ఆర్థిక వ్యవహారంలో జాగ్రత్త పడాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాది ఆర్థిక శాఖను చూసే వారికి చిక్కులు తప్పవని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాలతో నీటి పంపకాల వ్యవహరాల్లో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వస్తుందన్నారు. ఈ ఏడాది వార్తలు క్రియేట్‌ చేయాల్సిన అవసరం లేదనీ, మీడియాకు పుష్కలంగా వార్తలు లభిస్తాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -