భచ్చి సభలో మాజీ ఎంపీ బృందాకరత్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఊపందుకున్న ప్రచారం 
సీపీఐ(ఎం)అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి 
హయఘట్ : బీహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి సీపీఐ(ఎం)అభ్యర్థులు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే బీహార్ అసెంబ్లీకి పోటీచేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులు వినూత్నంగా ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. హయఘట్ అసెంబ్లీ నుంచి సీపీఐ(ఎం)అభ్యర్థి శ్యామ్ భారతికి మద్దతుగా భచ్చిలో సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఐ(ఎం) అగ్రనేత , మాజీ ఎంపీ బృందాకరత్ హాజరై ప్రసంగించారు. నియోజకవర్గాలు బాగుపడటమే కాదు, ప్రజాగళం వినిపించే తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గల్లీ ప్రచారాల్లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సీపీఐ(ఎం) అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజాసమస్యల విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని బృందాకరత్ భరోసా ఇచ్చారు.
మంజీ మళ్లీ సత్యేంద్ర భయ్యాదే : సీపీఐ(ఎం) అభ్యర్థికి ప్రజల మద్దతు
బీహార్ ఎన్నికల్లో ఈసారి కూడా మంజీ అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ(ఎం) అభ్యర్థి సత్యేంద్ర భయ్యాదేనని అక్కడి ప్రజలు అంటున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే అక్కడికి చేరుకునే వ్యక్తి ఎమ్మెల్యే సత్యేంద్ర యాదవ్ అని స్థానికులు చెబుతున్నారు. బీహార్ రాష్ట్రంలోని సరణ్ జిల్లాలో మంజీ స్థానానికి పోటీ చేస్తున్న ఆయన ప్రజలకు ప్రశ్నలు వేస్తూ వినూత్న ప్రచారం చేస్తున్నారు. ”మన దేశానికి రావాల్సిన ఫ్యాక్టరీలను గుజరాత్‌కు తీసుకెళ్లిన వారు మీ స్నేహితులా లేక శత్రువులా?’ అంటూ లెజువారా గ్రామంలో జరిగిన ప్రజా సభలో డాక్టర్ సత్యేంద్ర యాదవ్ గుమిగూడిన జనసమూహాన్ని అడిగారు. ”వారు మా శత్రువులు!…” అని వెంటనే సమాధానం ఏకగ్రీవంగా ఉంది. ”అంబేద్కర్ రాజ్యాంగాన్ని నాశనం చేసేవారు.. ఆయన విగ్రహాలను ధ్వంసం చేసేవారు.. మీ స్నేహితులా?” అని అభ్యర్థి తదుపరి ప్రశ్న. ”లేదు… వారు.. ప్రజలకు శత్రువులు…!” అని స్థానికులు స్పందించారు. 
మంజీలో సీపీఐ(ఎం) సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యేంద్ర యాదవ్ స్థానికులను ఓట్ల కోసం విజ్ఞప్తి చేస్తున్న తీరు ఇది. ప్రశ్నోత్తరాల శైలిలో వారి శత్రువులు ఎవరో చెప్పమని ఓటర్లను అడిగిన తరువాత, ఆయన మరో విషయం గురించి విచారిస్తారు, ”మీరు మీ శత్రువులకు ఓటు వేస్తారా?” అని అడిగిన వెంటనే ”లేదు.. వారికి మా ఓట్లు వేయం” అని ప్రజల నుంచి బిగ్గరగా సమాధానం వెంటనే వచ్చింది.2020లో పావు లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచిన సత్యేంద్ర యాదవ్ ఈసారి లక్ష దాటుతానని నమ్మకంగా ఉన్నారు. కుల ఆధారిత హత్యలు, దారుణాలకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో గత ఐదేండ్లలో అలాంటి సంఘటన జరగకపోవడం ఎమ్మెల్యేగా సత్యేంద్ర యాదవ్ సాధించిన అతిపెద్ద విజయం.రాజ్‌పుట్‌కు చెందిన రణధీర్ సింగ్‌ను జేడీయూ తన అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన ప్రభునాథ్ సింగ్ కుమారుడు రణధీర్. 1995లో తనను ఓడించిన ఎమ్మెల్యే అశోక్ సింగ్‌పై బాంబు విసిరి హత్య చేసినందుకు ప్రభునాథ్ జీవిత ఖైదులో ఉన్నాడు. 
దళితులు, వెనుకబడిన వర్గాలపై జరిగిన దారుణాలతో సహా 200కి పైగా క్రిమినల్ కేసుల్లో ఆయన నిందితుడు. ప్రభునాథ్ సింగ్‌ను సమర్థించే రాజకీయ లక్ష్యాన్ని చేపట్టడంతో సత్యేంద్ర యాదవ్ ప్రజా రంగంలో చురుగ్గా మారారు. ఆయనకు పార్టీ, ప్రజల పూర్తి మద్దతు లభించింది. ‘సత్యేంద్ర భయ్యా’ ఎమ్యెల్యే అయిన తరువాత, దళితులు, వెనుకబడిన తరగతులకు అడగడానికి, చెప్పడానికి ఒకరు ఉన్నారనేది స్పష్టం అయింది. అగ్ర కులాలు కాలనీల్లోకి ప్రవేశించడం, దౌర్జన్యాలు చేయడం మానేశారు. కాలనీలు, పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పించబడ్డాయి. సత్యేంద్ర యాదవ్‌కు పార్టీతో సంబంధం లేకుండా యువత నుంచి మద్దతు లభిస్తుంది. ”మొత్తం యువత ఆయనతో ఉన్నారు” అని ప్రచారంలో ముందంజలో ఉన్న యువకుడు పియూశ్ అన్నారు. అయితే సత్యేంద్ర యాదవ్ మళ్లీ గెలిస్తే, రాజ్‌పుత్ సమాజం ఆధిపత్యం చెలాయించదని రణధీర్ సింగ్ మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. రాజ్‌పుత్ వర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి రాణా ప్రతాప్ సింగ్‌ను పోటీ నుంచి నిరోధించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.
ప్రజాగొంతుక వినిపిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

