వాడివేడిగా ఏఆర్‌ఆర్‌లపై బహిరంగ విచారణ
టీజీఈఆర్సీకి రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వక హామీ
టీజీఎస్పీడీసీఎల్ రెవెన్యూలోటు రూ.9,583 కోట్లు
సబ్సిడీల సొమ్ము అందింది : సీఎమ్‌డీ
సోలార్ పవర్ టారీఫ్ మార్పులపై చైర్మెన్ ఆగ్రహం
విద్యుత్ ఉద్యోగుల అవినీతిని అరికట్టండి : వినియోగదారుల విజ్ఞప్తి
వాడివేడిగా ఏఆర్‌ఆర్‌పై బహిరంగ విచారణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల ఆదాయ లోటును ప్రభుత్వం భర్తీ చేసేందుకు అంగీకరించింది. ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపు లేనట్టే! శనివారంనాడిక్కడి విద్యుత్ నియంత్రణ భవన్‌లో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) 2026-27 ఆర్థిక సంవత్సర ఆదాయ ఆవశ్యకత (ఏఆర్‌ఆర్)పై బహిరంగ విచారణ జరిగింది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) చైర్మెన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్, సభ్యులు చెరుకూరి శ్రీనివాసరావు (ఫైనాన్స్), కంచెర్ల రఘు (టెక్నికల్) ఈ విచారణను నిర్వహించారు. ప్రారంభంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జితేష్ వీ పాటిల్ వచ్చే ఆర్థిక సంవత్సర ఆదాయ అవసరాల ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమిషన్‌కు వివరించారు. ఈ ప్రతిపాదనలపై రైతులు, వినియోగదారులు, పరిశ్రమల యజమాన్యాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు, విద్యుత్‌రంగ నిపుణులు తమ అభ్యంతరాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సోలార్ విద్యుత్ వినియోగదారులు పవర్ టారిఫ్ పెంపు అంశాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చైర్మెన్ జస్టిస్ నాగార్జున్ డిస్కం అధికారుల్ని తీవ్రంగా మందలించారు. కమిషన్ అనుమతి లేకుండా చార్జీలను ఎలా సవరిస్తారని ప్రశ్నించారు. తక్షణం పెంచిన చార్జీలను సవరించాలని అదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు, వినియోగదారులు విద్యుత్ ఉద్యోగుల అవినీతిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. ఈ సందర్భంగా సీఎమ్‌డీ జోక్యం చేసుకొని అవినీతిని కట్టడి చేసేందుకు సంస్థ తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. ఎవరూ విద్యుత్ ఉద్యోగులకు లంచాలు ఇవ్వొద్దని స్పష్టంచేశారు. ఎవరైనా డిమాండ్ చేస్తే పై అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
యూనిట్‌రేటు తగ్గించండి: దక్షిణ మధ్య రైల్వే
రైల్వేలకు డిస్కం ద్వారా సరఫరా చేస్తున్న విద్యుత్ యూనిట్ రేట్లను తగ్గించాలని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిఈఈ సయ్యద్ వాసిం పాషా కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదిత టారిఫ్‌లో యూనిట్ ధర రూ.7.03గా ఉందనీ, కానీ రైల్వే శాఖ విద్యుత్ జాతీయ వినియోగంలో రూ.5.80గా ఉందని విశ్లేషించారు. డిస్కంకు యూనిట్‌కు సగటు కంటే 21 శాతం అదనంగా చెల్లిస్తున్నామన్నారు.
లోకో మోటీవ్ రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా గ్రిడ్‌కు తిరిగి పంపే విద్యుత్ నమోదు కావడం లేదని కమిషన్ దృష్టికి తెచ్చారు. దీనివల్ల రైల్వేకు నష్టం జరుగుతోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఓపెన్ యాక్సిస్‌కు అనుమతివ్వాలని కోరారు. డిస్కం ప్రతిపాదించిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని హైదరాబాద్ మెట్రో రైల్, వాటర్‌బోర్డ్ సహా పలు ప్రభుత్వరంగ సంస్థలు కమిషన్‌ను కోరాయి.
రియాక్ట్ చార్జీలు సవరించండి: పరిశ్రమ వర్గాలు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్‌పై రియాక్ట్ చార్జీలను తగ్గించాలని ఫిక్కి, ఫ్యాఫ్సీ సహా పలు అసోసియేషన్లు విజ్ఞప్తి చేశాయి. రియాక్ట్ చార్జీల వల్ల చిన్న పరిశ్రమలు తీవ్రంగా నష్ట పోతున్నాయని తెలిపారు. వీటిపై నిపుణుల కమిటీని వేసి, ధరలు నిర్ణయించాలని కోరారు. సొలార్ విద్యుత్ టారిఫ్‌ను సైతం సవరించాలని కోరారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సబ్సిడీ ఇవ్వాలనీ, ఆఫ్ సీజన్ పీరియడ్ నిబంధనలను సవరించాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలు పరిష్కరిస్తాం-సీఎమ్‌డీ
బహిరంగ విచారణ ముగింపు సందర్భంగా ఫిర్యాదుదారుల ప్రశ్నలు, అభ్యంతరాలపై సీఎమ్‌డీ జితేష్ వీ పాటిల్ స్పందించారు. క్షేత్రస్థాయి సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. డీటీఆర్ ఫెయిల్యూర్స్‌ను 8.03 శాతానికి తగ్గించామని చెప్పారు.
పరిహారం చెల్లింపు
బహిరంగ విచారణ సందర్భంగా కమిషన్ చైర్మెన్ ప్రత్యేక ఆదేశాలతో విద్యుద్ఘాతానికి గురై మరణించిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు నష్టపరిహారం మంజూరు లేఖల్ని అక్కడికక్కడే అందచేశారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
ఇవీ కరెంటు లెక్కలు (ఎస్పీడీసీఎల్)
మొత్తం వినియోగదారులు – 1,20,95,963
ఆదాయ అవశ్యకత – రూ. 50242 కోట్లు
చెల్లించాల్సిన మొత్తం – రూ.38,492 కోట్లు
టారిఫ్‌లపై వచ్చే ఆదాయం – రూ.40659 కోట్లు
రెవెన్యూ లోటు – రూ.9583 కోట్లు
సరఫరా, పంపిణీ నష్టాలు
2020-21 ఆర్థిక సంవత్సరం 9.60 శాతం
2026-27 ఆర్థిక సంవత్సరం 8.04
విద్యుత్ కొనుగోలు ఖర్చు (రూపాయల్లో)
2022-23 – 6.35
2024-25 – 6.11
2026-27 – 5.54
డిస్కంల రెవెన్యూలోటు భర్తీ చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



