Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువైఎస్‌ఆర్‌ కలను నిజం చేస్తాం

వైఎస్‌ఆర్‌ కలను నిజం చేస్తాం

- Advertisement -

– ప్రాణహిత ప్రాజెక్టును చేపడతాం
– ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ను పూర్తి చేస్తాం
– సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని రూపొందిస్తాం : సుభాశ్‌ పాలేకర్‌కు డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి మెమోరియల్‌ అవార్డు ప్రధానోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి కన్న కలలను నిజం చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి రంగారెడ్డి జిల్లా వరకు గోదావరి నీళ్లిస్తామనీ, ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌ను పూర్తి చేసి నల్లగొండ జిల్లాలో 3.60 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చి, ఫ్లోరోసిస్‌ను పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. వైఎస్‌ఆర్‌ చివరి కోరిక రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామని ప్రకటించారు. సుభాష్‌ పాలేకర్‌ చేసిన సూచనను స్వీకరిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒక విధానాన్ని రూపొందిస్తామని మాటిచ్చారు. డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి 16వ వర్థంతి సందర్భంగా ఎమెస్కో విజరు కుమార్‌ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకులు సుభాష్‌ పాలేకర్‌కు డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి మెమెరియల్‌ అవార్డుతో పాటు రూ.25 లక్షల నగదు ప్రోత్సహకాన్ని అందజేశారు.

ప్రకృతి వ్యవసాయం చేస్తున్న డాక్టర్‌ సి.సుధ, డాక్టర్‌ సి.నాగేశ్వరరావు దంపతులను సన్మానించి అవార్డును అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను, రైతులను ఆదుకోవడంలో వైఎస్సార్‌ తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్‌ తదితర పథకాలు భవిష్యత్తులో ఎవరూ సీఎం అయినా కూడా మార్చలేనంతగా ప్రజల కోసం ప్రవేశపెట్టినవని తెలిపారు. వైఎస్సాఆర్‌ ఆలోచనలతో కొనసాగుతున్న తమ ప్రభుత్వం ఆ పథకాలను మరింత మెరుగ్గా అమలు చేస్తున్నదని వివరించారు. వ్యవసాయాన్ని పండుగలా చేస్తానన్న వైఎస్సాఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని తెలిపారు. ఉచిత కరెంట్‌ మొదలు అనేక పథకాల గురించి వైఎస్‌ చెప్పినప్పుడు సాధ్యం కాదన్న వారి సంఖ్య ఎక్కువగా ఉందనీ, అయితే వాటిని వైఎస్‌ఆర్‌ అమలు చేసి చూపించారని గుర్తుచేశారు. కేంద్రం సహకరించకపోవడంతో రాష్ట్రంలో రైతులు యూరియా సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలేకర్‌ చేసిన సూచన బాగుందనీ, సేంద్రీయ వ్యవసాయం దిశగా అడుగులు వేస్తామన్నారు. తనకు రాజకీయాల పట్ల మంచి అభిప్రాయం కలగడంలో ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి నాడు చట్టసభలో సమాధానమిచ్చిన తీరు కూడా కారణమన్నారు. ఈ తరంలో వైఎస్సాఆర్‌-కేవీపీ వంటి మిత్రులు ఉండరని కొనియాడారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ ఆలోచనను, కాంగ్రెస్‌ భావజాలాన్ని రేవంత్‌ సర్కార్‌ అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రజల కోసం అనేక మంచి నిర్ణయాలను వైఎస్సాఆర్‌ తీసుకున్నారని చెప్పారు. అందరం కలిసి ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. భూపీందర్‌ సింగ్‌ హుడా మాట్లాడుతూ కె.ఎల్‌.రావు సమాధిని పునరుద్ధరించి బాగు చేయాలని సీఎం రేవంత రెడ్డిని కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రావడంలో దివంగత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డితో పాటు తన పాత్ర కూడా ఉందని తెలిపారు. మానవ సంబంధాలు నెరపడంలో వైఎస్సాఆర్‌కు సాటి లేదని తెలిపారు. మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ వైఎస్సాఆర్‌ చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నామని తెలిపారు.

స్నేహమంటే కేవీపీదే : రఘువీరారెడ్డి
వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి కుటుంబ సభ్యులు ఆస్తుల కోసం పాకులాడుతుంటే స్నేహితునిగా కేవీపీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని రఘువీరారెడ్డి తెలిపారు. స్నేహమంటే కేవీపీదేనని కొనియాడారు. రైతుల కోసం నిలబడ్డ వారే వైఎస్సాఆర్‌ వారసులని తెలిపారు.

గ్రామాల డబ్బులు పోకుండా ఆపాలి : సుభాశ్‌ పాలేకర్‌
ఒక్కో గ్రామం నుంచి రూ.4.20 కోట్ల ధనం అభివృద్ధి చెందిన దేశాలకు తరలిపోతున్నదని అవార్డు గ్రహీత సుభాశ్‌ పాలేకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బులు తరలిపోవడమే గ్రామాల అభివృద్ధికి ప్రధాన ఆటంకమని తెలిపారు. ఆ నిధులు పోకుండా ఆపాలని సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు. గ్లోబల్‌ వార్మింగ్‌, వాతావరణ మార్పులు, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ ప్రపంచానికి శత్రువులుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక విధానాన్ని రూపొందించి రాష్ట్రంలో కనీసం ఒక గ్రామాన్ని ఆదర్శంగా మారిస్తే అదే పెద్ద విప్లవం తెస్తుందని తెలిపారు. గ్రామాల నుంచి నిధులు వెళ్లకుండా ఆపగలిగితే అద్భుతం జరుగుతుందని వివరించారు. వైఎస్‌ఆర్‌ ఆశయం కోసం ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధమని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad