ప్రతిపక్ష నేతగా సభకు రండి కేసీఆర్
ఒక్కోమెట్టు ఎక్కుతూ సీఎం అయ్యా… 2029లోనూ మాదే అధికారం
నాలుగు కోట్ల ప్రజల ప్రయోజనమే మా ధ్యేయం
గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షం ధన్యవాదాలు తెలపకపోవడం బాధాకరం
పంటమార్పిడిపై అన్నదాతలను చైతన్యపరుస్తాం
ఆర్గానిక్ ఫుడ్, వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తాం : శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి
శుక్రవారానికి శాసనసభ వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎవరు కలిసొచ్చినా.. కలిసిరాకపోయినా 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. ప్రతి రంగానికి ప్రత్యేక పాలసీలు రూపొందించి దానికనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వచ్చి ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. విజన్‌తో కూడిన గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్షం ధన్యవాదాలు తెలపకపోవడం బాధాకరమన్నారు. పెద్దాయన పార్టీ బాధ్యతలు అప్పగించిపోతే వాళ్లిద్దరూ(కేటీఆర్, హరీశ్‌రావు) చింపిన ఇస్తరాకు మాదిరిగా మారుస్తున్నారని విమర్శించారు. తాను క్షేత్రస్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ రాజకీయనేతగా ఎదిగి సీఎం అయ్యాననీ, 2029లోనూ తమదే అధికారమని స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం మాట్లాడారు.
ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు. బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ రెండు పార్టీల వైఖరులను తప్పుబడుతూ సుదీర్ఘంగా ప్రసంగించారు. అనంతరం స్పీకర్ సభను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తెలంగాణ ప్రజల, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేసిన ప్రసంగం చారిత్రాత్మకమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గత చరిత్రను అనుభవాలుగా మార్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ ప్రసంగం తయారు చేశారన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 11.5 శాతం వడ్డీకి అప్పు తెస్తే కేంద్రం చుట్టూ తిరిగి దాన్ని 7.5 శాతం తగ్గించుకున్నామనీ, పార్టీ పరంగా సైద్ధాంతికంగా విభేదాలున్నప్పటికీ ఈ విషయంలో సహకరించిన నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిన మూడు నెలల్లో పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని విమర్శించారు. నోటిఫికేషన్లు వేయడం, కోర్టులకు ఎక్కేలా చేయడం, నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం ఆనాడు షరామామూలుగా జరిగిందన్నారు. అదే బంధువు, కుటుంబ సభ్యురాలు ఎంపీగా ఓడిపోతే మూడు నెలల్లో వారికి పోస్టులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తమ పాలనలో 80వేలకు పైగా ఉద్యోగాలను భర్తీచేశామని నొక్కి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రతిపక్షం కలిసి వస్తుందని భావించినా…వారి అహంకార ధోరణి ఇంకా పోలేదని విమర్శించారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
అధికారం పోయినా ఇంకా తామే రాజులమనే భావనతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారనీ, రాచరికంలో వారసత్వానికి అవకాశం ఉందిగానీ ప్రజాస్వామ్యంలో దానికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. తెలంగాణతల్లి ఆవిష్కరణకు ప్రధాన ప్రతిపక్ష నేత వస్తారని ఆశిస్తే నిరాశే మిగిలిందన్నారు. ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా అదే అహంకార పూరిత ధోరణి వ్యవహరిస్తున్నారని తెలిపారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా జీతం రూపంలో కోటీ ఆరు లక్షల రూపాయలు తీసుకున్న వ్యక్తి సభకు గైర్హాజరు కాకపోవడం సరిగాదనీ, విధులకు హాజరుకాకుండా ఉన్నవారిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ముందు చూపుతో స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రణాళికలతో ముందుకెళ్లడం, ఆ తర్వాత ఇందిరాగాంధీ, రాహుల్‌గాంధీ, పీవీ నర్సింహారావు, మన్మోహన్‌సింగ్ తీసుకున్న కీలక నిర్ణయాలు, సంస్కరణలు ప్రపంచం ముందు భారత్‌ను ఒక శక్తివంతమైన దేశంగా నిలబెట్టాయన్నారు. పేదలకు ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇచ్చిన, సీలింగ్, అసైన్డ్ భూములు పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదేనన్నారు. వారి వ్యూహాత్మక ఎత్తుగడలతోనే నేడు ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలకు మన దేశం వారు సీఈఓలుగా ఉన్నారని గుర్తుచేశారు. సిలికాన్ వ్యాలీలో మన తెలుగువాళ్లు రాణించడానికి కారణం రాహుల్‌గాంధీ, పీవీ, మన్మోహన్‌సింగ్ తీసుకున్న సంస్కరణలే కారణమని వివరించారు. నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి హైదరాబాద్‌లో హైటెక్ సిటీకి శంకుస్తాపన చేస్తే చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.
ఆక్రమణలు తొలగించడం… నాలాలను రక్షించడం ఇష్టం లేదా?
తాము మూసీ సుందరీకరణ చేస్తామంటే ప్రతిపక్షం అడ్డుపడుతామని చెప్పటాన్ని సీఎం తప్పుబట్టారు. ఆక్రమణలు తొలగించడం, పరిశ్రమలు తరలించడం, చెరువులు, నాలాలను పరిరక్షించడం లాంటి మంచి చేయొద్దా? అని నిలదీశారు. కాలుష్యంతో రాజధాని ఢిల్లీ, వర్షాల ఎఫెక్ట్‌తో ఫైనాన్సియల్ రాజధాని ముంబై, ట్రాఫిక్ సమస్యతో బెంగుళూరు నగరాలు కూరుకుపోవడంతో ఐటీ, తదితర రంగాల పరిశ్రమలు తెలంగాణ వైపు చూస్తున్నాయని వివరించారు. నల్లచెరువును హైడ్రా రక్షిస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారనీ, ఉమర్‌ఉద్దౌల్లా చెరువు పునరుద్ధరిస్తే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. తుమ్మిడి కుంటను ప్రముఖ సినీస్టార్ అక్రమించుకుంటే ఆక్రమణలు తొలగించి చెరువును కాపాడామనీ, రియల్టర్ల కబ్జా నుంచి సున్నం చెరువును రక్షించుకున్నామని వివరించారు. బేగంపేటలో 200 ఫీట్ల ఉన్న నాలా 30 ఫీట్లకు కుచించుకుపోయిందనీ, హైదరాబాద్ నగరాన్ని కొంత మంది దురాశపరులు ఆమ్రణలకు పాల్పడితే కాడపాడుతున్నామని నొక్కి చెప్పారు.
ఇలా మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవడమేంటని నిలదీశారు. హైదరాబాద్ నగరంలో నాలాలపై 28వేల అక్రమ కట్టడాలున్నాయనీ, చట్టం ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేయాలని చెబుతున్నదని కేసీఆర్ అనలేదా? ప్రశ్నించారు. డ్రోన్లతో, మ్యానువల్‌గా సర్వేలు చేయించి అక్రమ కట్టడాలను జేసీబీలతో కూల్చేస్తామని కేటీఆర్ చెప్పలేదా? అని నిలదీశారు. మూసీలో కంటే వీళ్ల కడుపులో ఎక్కువ విషం ఉందని విమర్శించారు. మీ పాలిత రాష్ట్రాల్లో సబర్మతీ, గంగా, యుమునా రివర్ ఫ్రంట్ల పేరుతో ప్రక్షాళన చేస్తున్నారు కదా? సబర్మతిలో వేల కుటుంబాలు నిర్వాసితులు అయ్యారు కదా? అందులో ఎంత మందికి పరిహారం ఇచ్చారు? దానిపై నిజనిర్ధారణ కమిటీ వేసి పంపుదామా? ఇక్కడ మూసీ ప్రక్షాళన చేసుకుంటుంటే వచ్చిన సమస్య ఏంటి? అని బీజేపీ సభ్యులను ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో పర్యావరణాన్ని మెరుగుపర్చేందుకు డీజీల్‌తో నడిచే 2800 ఆర్టీసీ బస్సుల స్థానంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురాబోతున్నామని తెలిపారు. నగరంలోకి డీజిల్, పెట్రోల్ ఆటోలకు ఈవీ ఇంజన్లను పిట్ చేయిస్తామన్నారు. ఈవీ వాహనాలను కొంటున్నవాళ్లపై పన్ను వేయట్లేదని స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లు, మూడు కమిషనరేట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డబ్బుల కోసం వాళ్లు మెట్రోను ఆపితే తాము ట్రాఫిక్ నియంత్రణకు మెట్రోను విస్తరిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ పాలకులు ఔటర్ రింగ్‌రోడ్డును పల్లీబఠాణీలకు అమ్లుకున్నారని విమర్శించారు. పబ్లిక సెక్టార్‌ను తెగనమ్ముతున్న ఈ రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకున్నదని గుర్తుచేశారు. ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ రింగ్ రైలు కూడా రాబోతున్నదని తెలిపారు. కేంద్రం బుల్లెట్ ట్రైన్ హబ్ ను తెలంగాణకు ఇచ్చిందన్నారు.
ఆర్గానిక్ సాగును ప్రోత్సహిస్తాం
ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని సీఎం చెప్పారు. వరి వేసుకుంటే ఉరి వేసుకుంటరు అన్నోళ్లు రూ.4200 క్వింటా ఎలా అమ్ముకుంటున్నారు? బ్లాక్‌మనీని వైట్‌మనీగా చేసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. క్యాప్సికం పంట సాగు చేస్తే ఎకరానికి కోటి సంపాదించొచ్చు అంటున్నారు కదా…ఆ విద్య తెలంగాణ రైతులకు ఎందుకు నేర్పించడం లేదు? రైతులు కోటీశ్వర్లు కావడం ఇష్టం లేదా? అని అడిగారు. రాష్ట్రంలో కోటీ ఆరు లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నామనీ, సన్నబియ్యంతో సభలోని ప్రజాప్రతినిధులకు ఒక రోజు భోజనం పెట్టించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం సూచించారు. ఆర్గానిక్ ఫుడ్‌కు ప్రపంచస్థాయిలో డిమాండ్ ఉందనీ, రైతును రాజుగా చేసే ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు రాష్ట్రంలోని వంద నియోజకవర్గాల్లో రూ.2400 కోట్లతో ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏఐ సునామీని తట్టుకునేలా యువతను తయారు చేస్తున్నామనీ, అందులో చదువుకునే విద్యార్థులకు రూ.2 వేల స్కాలర్‌షిప్పు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో బ్లూకాలర్ జాబ్‌లు క్రియేట్ చేస్తామని చెప్పారు.
విశ్వాసఘాతకులుగా మారకండి…
తెలంగాణ కాంగ్రెస్ దయతో, సోనియాగాంధీ ఆశీర్వచనంతో వచ్చిందని కేసీఆర్‌నే చెప్పారని సీఎం రేవంత్‌రెడ్డి సభలో గుర్తుచేశారు. కేసీఆర్ మాట్లాడిన మాటలను కూడా వ్యతిరేకిస్తారా? విశ్వాసఘాతకులుగా మారకండి అంటూ కేటీఆర్, హరీశ్‌రావులకు చురకలు అంటించారు. మీరు కాదన్నా తెలంగాణ సమాజం సోనియాగాంధీని ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. నమ్మి పార్టీని అప్పగించి పోతే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు, ఆయనకు వ్యతిరేకంగా బావబామ్మర్దులు పనిచేస్తున్నారని విమర్శించారు. నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పదేండ్లు పడుతుందా? పదేండ్లు మీరే అధికారంలో ఉన్నారు కదా ఎందుకు భర్తీ చేయలేదు? అని ప్రశ్నించారు.
వడ్డీరేటు 11.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించాం…
ఎఫ్‌ఆర్‌ఎమ్‌బీ కింద 1.72 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 11.5 శాతానికి భారీ స్థాయిలో అప్పులు చేసిందని విమర్శించారు. లక్షల కోట్ల రూపాయల అప్పును తక్కువ వడ్డీకి రీకన్‌స్ట్రక్షన్ చేయాలని ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చుట్టూ తిరిగామన్నారు. తమ బాధ చూడలేక నిర్మలాసీతారామన్ వడ్డీ రేటును 7.5 శాతానికి తగ్గించారనీ, ఈ విషయంలో ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. దీని ద్వారా ఏటా నాలుగువేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయనీ, సంక్షేమ పథకాలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో ఇప్పటిదాకా రూ.3.50 లక్షల కోట్లు చెల్లించామని వివరించారు. తమ ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు. మహిళల పట్ల బీఆర్‌ఎస్ నేతలకు ఏమాత్రం గౌరవం లేదనీ, సొంతింటి ఆడబిడ్డను ఇబ్బంది పెట్టినవారు సమాజంలోని మహిళల గురించి ఏం ఆలోచిస్తారు? సొంత ఆడబిడ్డను పార్టీ నేతలతో తిట్టిస్తారా? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన నైట్ బజార్‌ను కార్పొరేట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు.
క్యూర్.. ప్యూర్.. రేర్…
ప్రపంచంలో ఏఐ సునామీ రాబోతున్నదనీ, దాని ప్రభావంతో నిరుద్యోగ సమస్య రాబోతున్నదనే చర్చ నడుస్తున్నదని సీఎం అన్నారు. దాన్ని తట్టుకుని బలమైన శక్తిగా ఎదగాలనే ఆలోచనతోనే విజన్ డాక్యుమెంట్‌ను సభలో ప్రవేశపెట్టామని చెప్పారు. భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోకపోతే చరిత్ర క్షమించబోదని హెచ్చరించారు. విజన్ 2047ను రెండు భాగాలుగా విభజించుకుని ముందుకు సాగుతున్నామనీ, ఇలాంటి తరుణంలోనూ సహకరించాల్సిన ప్రతిపక్షం రాజకీయం చేయడం, స్వార్థపూరితంగా ఆలోచించడం సబబు కాదన్నారు. తెలంగాణను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ(ప్యూర్), రూరల్ అండ్ అగ్రి రీజియన్ ఎకానమీ(రేర్) మూడు భాగాలుగా విభజించి పర్యావరణ, ఐటీ, నిటిఅయోగ్, నల్సార్ యూనివర్సిటీ, మేధావులను భాగస్వామ్యం చేసుకుని ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ యువతకు ఎలా భరోసానివ్వాలి? మహిళలను ఎలా నిలబెట్టాలి? రైతులకు ఎలా అండగా ఉండాలి? అనే స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని వివరించారు. క్యూర్ నుంచి రెడ్, ఆరెంజ్ పరిశ్రమలను తరలించి సర్వీస్ సెక్టార్‌గా మార్చాలనే పాలసీని తీసుకున్నామని తెలిపారు.



