Wednesday, July 23, 2025
E-PAPER
Homeకరీంనగర్అచ్యుతానందన్ స్ఫూర్తితో ఉద్యమిస్తాం

అచ్యుతానందన్ స్ఫూర్తితో ఉద్యమిస్తాం

- Advertisement -
  • – సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
    నవతెలంగాణ – కరీంనగర్
  • ప్రజా ఉద్యమాల స్ఫూర్తి ప్రదాత, విప్లవ జ్యోతి, కామ్రేడ్ వి ఎస్ అచ్యుతానందన్ స్ఫూర్తితో జిల్లాలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు.  మంగళవారం రోజున స్థానిక ముకుంద లాల్ మిశ్రా భవన్ లో కేరళ మాజీ ముఖ్యమంత్రి వి ఎస్ అచ్యుతానందన్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాప సూచికగా పార్టీ జెండాను అవనతం చేశారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ నూట రెండేళ్ల నిండు జీవితం గడిపిన వి ఎస్ ఎనిమిదిన్నర దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవాన్ని గడిపారని గుర్తు చేశారు.
  • కేరళ కమ్యూనిస్టు ఉద్యమంలో అభివృద్ధిలో ఆటుపోట్లు అన్నింటినీ దగ్గరగా చూసిన యోధుడన్నారు. అవినీతికి, ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా రాజీ పడిన రీతిలో నిలిచారన్నారు. వి ఎస్ గొప్ప నిర్మాణ దక్షుడని 17 సంవత్సరాల ప్రాయంలోనే ప్రజా పోరాటాల్లో పాలుపంచుకున్నారని, కేరళలో భూస్వామ్య వ్యతిరేక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పున్నప్రాయులర్ పోరాటంలో పాల్గొన్నారు అని, ఆ పోరాటంలో జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. కేరళలో పేద ప్రజలకు లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారని, 10 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు. కేరళలో అన్ని పార్టీల వారితోనూ గౌరవించబడ్డ మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమంలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొన్న నేతల్లో ఒకరన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు.
  • వివిధ పోరాటాలకు ఆయన స్వయంగా నాయకత్వం వహించారని ప్రజా పోరాటాల్లో ముందు వరుసలో నిలిచేవారని, అవినీతి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాజీలేని పోరు చేశారన్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, కేరళ ప్రతిపక్ష నాయకుడిగా రెండు పర్యాయాలు, 2006 నుండి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. పోరాటాల వారసత్వానికి ఒక అద్భుత చిహ్నం వి ఎస్ అన్నారు. ఎక్కడ తన రాజకీయ వైఖరి పై రాజీ పడలేదని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రకు సరికొత్త అసమానమైన సామాజిక రాజకీయ కోణాన్ని జోడించారన్నారు. తుది శ్వాస వరకు సాధారణ జీవితం గడిపారన్నారు. దేశ రాజకీయాల్లో మచ్చలేని మహా నేత వి ఎస్ అన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన జీవితం అనేక తరాలకు ప్రేరణగా నిలుస్తుంది అన్నారు.

ఆయన ఆదర్శాలను పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అన్నారు. 

ఆయన పోరాట స్ఫూర్తితో జిల్లాలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని వాసుదేవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, డి నరేష్ పటేల్, కోనేటి నాగమణి, జిల్లా నాయకులు శ్రీకాంత్, పుల్లెల మల్లయ్య, అరవింద్, రక్షక్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -