ఏపీ ప్రతిపాదనలను అడ్డుకుంటాం
కేంద్రంపై ఒత్తిడితో పాటు న్యాయ పోరాటం చేస్తాం: నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ ఏ రూపంలో మళ్లించినా అంగీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారమొక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి ట్రిబ్యూనల్ 80 టీఎంసీలకు అనుమతిం చిందనీ, అంతకంటే ఒక్క చుక్కనీరు ఎక్కువ తీసుకెళ్లినా ఉపేక్షించబోమని తెలిపారు. తమ ప్రభుత్వం అడ్డుకోవడం వల్లే గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఏపీ ఉపసంహ రించుకుందని వివరించారు. దాని స్థానంలో గోదావరి- నల్లమలసాగర్ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించిందని తెలిపారు. సెంటల్ర్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యూనల్ (జీడబ్ల్యూడీటీ), పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఒక వైపు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాశయాల్లో 200 టీఎంసీల నీటిని మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నికర జలాలు కాకుండా అదనపు జలాలపై ఆధారపడి ప్రాజెక్ట్ చేపట్టడం సరికాదన్నారు.
వరద రాని సీజన్‌లో నికర జలాలను మళ్లిస్తారనీ, ఫలితంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగుతుందని తెలిపారు. అదనపు వాటా తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏపీ తీసుకుంటున్న ప్రణాళికలు వెలుగులోకి రాగానే తక్షణమే స్పందించి జనవరి 22న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు, జూన్ 13, 16 తేదీల్లో జలశక్తితో పాటు పర్యావరణ, అటవీ శాఖలకు లేఖలు రాశామని గుర్తు చేశారు. అంతర్‌రాష్ట్ర వివాదాలు పరిష్కారం కాలేదనీ, గోదావరి నది యాజమాన్య బోర్డు నిబంధనలకు విరుద్ధమనీ, వరద నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అనుమతి అవసరమని పేర్కొన్నారు. అయినా ఆంధ్రప్రదేశ్ గతేడాది నవంబర్ 21న డీపీఆర్ టెండర్లను పిలవడంతో, తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 16, 2025న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ నెం.1258/2025 దాఖలు చేసిందని తెలిపారు. గోదావరిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటి హక్కులను కాపాడుకోవడమే మా ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. తాము నిర్లక్ష్యం చేస్తున్నామని ప్రతిపక్షాలు చెప్పడం అసత్యమని తెలిపారు. తెలంగాణా నీటి వాటాల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తేల్చి చెప్పారు.



