కొనసాగుతున్న టీమ్స్ డ్రైవర్ల నిరసన
అర్హత లేని యస్‌డీఐ రాజీనామా..!
నవతెలంగాణ-భద్రాచలం
పని భారం తగ్గి, అధికారుల వైఖరిలో మార్పు వచ్చేంతవరకూ ఆందోళననుంచి వెనక్కు తగ్గబోమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ టీమ్స్ డ్రైవర్లు నిరసనను కొనసాగిస్తున్నారు. టీమ్స్ డ్రైవర్లపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అర్ధరాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగిన సుమారు 60 మంది డ్రైవర్లు గురువారం సైతం విధులకు హాజరుకాలేదు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోనే దోమలను సైతం లెక్కచేయకుండా అక్కడే నిద్రించి తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు కార్మిక సంఘాలతో పాటు వివిధ రాజకీ య పక్షాల మద్దతు తెలిపాయి. రీజనల్ మేనేజరే స్వయంగా వచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకూ తమ నిరసనను విరమించేది లేదని తేల్చి చెప్తున్నారు. టీమ్స్ డ్రైవర్ల పై పని భారం పెరిగి ఒకే వారంలో దాదాపు 8 మంది డ్రైవర్లు అనారోగ్య పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ అవసరాల కోసం సెలవు అడిగినా ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని కార్మికుతు తెలిపారు. వీటికి ప్రధాన కారణం డిపో మేనేజర్‌నేనని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేపడితే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు.
అర్హత లేని ఎస్‌డీఐ రాజీనామా..?
డిపో మేనేజర్‌గా తిరుపతి బాధ్యతలు చేపట్టిన తరువాత అర్హత లేని వ్యక్తులను కూడా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ బాధ్యతలను అర్హత లేని వ్యక్తికి కట్టబట్టారని కార్మికుతు ఆరోపించారు. ఎస్‌డీఐ బాధ్యతలు చేపట్టిన సదరు వ్యక్తి డ్రైవర్‌గా విధులు నిర్వహించే సందర్భంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ సైతం మృతి చెందగా కొంతకాలం సస్పెండ్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. అటువంటి వ్యక్తిని సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్‌గా నియమించడం ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. దిద్దుబాటు చర్యలో భాగంగా మంగళవారం ఆ వ్యక్తి తన బాధ్యతలు నుండి వైదొలుగుతున్నట్టు రాతపూర్వకంగా రాసిచ్చారని తెలుస్తోంది. అన్నిటిపైనా విచారణ చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం
టీమ్స్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్టీసీ యాజమాన్యం పరిష్కరించాలి. ఆందోళన చేస్తున్న వీరికి సీఐటీయూ పూర్తి మద్ధతిస్తుంది. గురువారం బస్టాండ్ ఆవరణలో నిరసన కొనసాగిస్తున్న డ్రైవర్లకు సీఐటీయూ బృందం వెళ్లి మద్దతు ప్రకటించాం. భద్రాచలం డిపో మేనేజర్ వైఖరి వల్ల గత సంవత్సర కాలంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఆర్టీసీలో యూనియన్లు రద్దు అయిన నాటి నుండి కార్మికులపై వేధింపులు అంతకంతకు పెరుగుతున్నాయి. సంఘీభావం తెలిపిన వారిలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ బండారు శరత్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఎంబీ నర్సారెడ్డి, సీనియర్ నాయకులు ఎం.వి.ఎస్ నారాయణ, ముత్తయ్య ఉన్నారు.
-సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్
సమస్యలు ఉంటే ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు సభ్యుల దృష్టికి తీసుకువెళ్లాలి
ఖమ్మం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సరిరామ్ నాయక్
టీమ్స్ డ్రైవర్ల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నాం. ఏమైనా సమస్యలు ఉంటే ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు సభ్యుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈ నెల 5వ తేదీనే ఎగ్జిక్యూటివ్ మెంబర్‌తో కలిసి భద్రాచలం పర్యటించాం. గేటు మీటింగ్ కూడా ఏర్పాటు చేశాం. అప్పుడు ఎవరు ఏ సమస్యనూ మా దృష్టికి తీసుకురాలేదు. ఇప్పటికైనా తమ సమస్యలను వెల్ఫేర్ బోర్డు సభ్యుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలి. ఒకే వారంలో 8 మంది డ్రైవర్లు సిక్ అయిన విషయం మాకు తెలియదు. ఒక కార్మికుడికి అనారోగ్యంగా ఉన్నారని తెలిస్తే తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి పంపించాం. కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.