Saturday, January 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకోం

సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకోం

- Advertisement -

– మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
– సిద్దిపేటలో బీజేపీకి భారీ షాక్‌.. బీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు పత్తిరి శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు హనుమంతరావు
– ఎంపీ రఘునందన్‌రావు వల్లే పార్టీ మారుతున్నాం : పార్టీ మారిన నాయకులు
నవతెలంగాణ-సిద్ధిపేట

‘నాపై కోపం ఉంటే నా మీదే చూపించు.. సిద్దిపేట ప్రజలపై కాదు. సిద్దిపేట జిల్లాను రద్దుచేస్తే ఊరుకోం’ అని సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు పత్తిరి శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు హనుమంతరావు తమ అనుచరులతో కలిసి శుక్రవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలో ఒకప్పుడు మంచినీళ్ల కష్టాలు ఎలా ఉండేవో, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తన కంటే మీకే బాగా తెలుసని అన్నారు. ఒకప్పుడు నీళ్ల కోసం సిద్దిపేటకు పిల్లని ఇవ్వడానికి కూడా భయపడేవారన్నారు. ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు, మురికి కాలువలు గుర్తుకొచ్చేవని.. ఇప్పుడు పందులు మాయమయ్యాయని తెలిపారు. మోరీల స్థానంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రయినేజీలు వచ్చాయన్నారు. సైకిళ్ల మీద నీళ్లు మోసే బాధలు పోయి, ఇంటింటికి నల్లా నీళ్లు వచ్చాయన్నారు. అన్ని రంగాల్లో సిద్దిపేట రాష్ట్రానికి మోడల్‌గా నిలిచిందని తెలిపారు. సిద్దిపేట చదువుల తల్లిగా, మెడికల్‌ కాలేజీ, పాలిటెక్నిక్‌, ఫార్మసీ, నర్సింగ్‌, మహిళా డిగ్రీ కాలేజీతో విద్యాక్షేత్రంగా వెలుగొందుతోందని చెప్పారు. వైద్యంలోనూ అగ్రగామిగా నిలిచిందనీ, దేవాలయాల జిల్లాగా సిద్దిపేట కీర్తి గడించిందన్నారు. ఎమ్మెల్యేగా మీ గౌరవం, ప్రతిష్ట పెరిగేలా పనిచేశాననీ, సిద్దిపేట ప్రజలను ఎవరైనా చూస్తే అదృష్టవంతులు అనే స్థాయికి తీసుకువచ్చానని తెలిపారు. 40 ఏండ్ల సిద్దిపేట ప్రజల కలను కేసీఆర్‌ నిజం చేసి జిల్లాను ఇచ్చారనీ, కానీ ఇప్పుడు రేవంత్‌ రెడ్డి జిల్లాలు ఎక్కువయ్యాయని సాకు చూపి సిద్దిపేట జిల్లాను రద్దు చేసి మళ్ళీ సంగారెడ్డిలో కలపాలని కుట్ర చేస్తున్నారన్నారు. జిల్లా రద్దయితే కలెక్టరేట్‌, మెడికల్‌ కాలేజీ, జిల్లా ఆస్పత్రి, ఎస్పీ ఆఫీస్‌, ఇరిగేషన్‌ ఆఫీసులన్నీ పోతాయనీ, సిద్దిపేట అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. సిద్దిపేట అంటే తన కుటుంబం అని.. దసరా అయినా, రంజాన్‌ అయినా మీ మధ్యలోనే ఉంటానని అన్నారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని, కౌన్సిలర్‌, చైర్మెన్‌ మనవాళ్లు ఉంటేనే అభివృద్ధి ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పత్తిరి శ్రీనివాస్‌, హనుమంతరావు మాట్లాడుతూ.. రఘునందన్‌రావు నిర్వాకం వల్లనే బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చామని, ఒక అనామకుడుని తీసుకువచ్చి జిల్లా అధ్యక్షునిగా చేశాడని, జిల్లాలో బీజేపీ లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజనర్సు, సంపత్‌ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, సాయిరాం, సురేష్‌, విఠోబా, సత్తయ్య, ప్రభాకర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, అరవింద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -