Wednesday, July 16, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపేదల జోలికి వస్తే ఊరుకోం

పేదల జోలికి వస్తే ఊరుకోం

- Advertisement -

గూండాలు, రౌడీలకు బెదిరేది లేదు
మహిళలంతా శివంగులే.. వారిని దాటి అడుగేయలేరు
గూడు చెదిరితే ఎక్కడికి వెళ్లేది ొసీఎం రేవంత్‌రెడ్డి రావాల్సిందే..
కోటిమంది కోటీశ్వరులు కాదు.. ఉండేందుకు గూడివ్వండి చాలు : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
బసవతారకనగర్‌ గుడిసెవాసులకు మద్దతు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని.. గూండాలు, రౌడీలకు బెదిరేది లేదని.. మహిళలంతా శివంగులై తిరగబడితే.. వారిని దాటి అడుగు కూడా ముందుకు వేయలేరని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి హెచ్చరించారు. పేదల గూడు చెదిరితే ఎక్కడికి వెళ్లేదని.. వారు ఉన్న ప్రాంతంలోనే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి డివిజన్‌లోని బసవతారకనగర్‌లో గుడిసెలు కోల్పోయిన పేదల పోరాటానికి ఐద్వా మద్దతు తెలిపింది. సీపీఐ(ఎం), సీపీఐ, ఎంసీపీఐ, ఐద్వా నాయకులు వారిని పరామర్శించారు. గుడిసెవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు కూలిన గుడిసెలను చూపిస్తూ నాయకుల ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. 40 ఏండ్లుగా ఇక్కడే ఉన్నామని.. ఇప్పుడు గుండాలు వచ్చి తమపై దాడికి పాల్పడి, గుడిసెలను కూల్చివేశారని తెలిపారు. పేదలకు ఆయా వామపక్ష పార్టీల నాయకులు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. 40 ఏండ్లుగా ఇక్కడ జీవిస్తున్న పేదలను ఇక్కడి నుంచి వెళ్లగొట్టి ఆ భూములను ప్రయివేటు వ్యక్తులకు ధారదత్తం చేసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. బెదిరింపు రాజకీయాలతో పేద ప్రజలను ఏమీ చేసినా అడిగే వారు లేరని దౌర్జన్యాలకు పాల్పడితే.. ఎర్రజెండా చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెల పోరాటాలు కొనసాగుతున్నాయని, పలు ప్రాంతాల్లో కూడా దాడులు చేయడం, కేసులు పెట్టినట్టు తెలిపారు. కానీ అక్కడి ప్రజలు ఐక్యంగా పోరాడితే పెద్దపల్లిలో 150 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. సాయుధ పోరాటం నుంచి నేటి వరకు అనేక పోరాటాల్లో మహిళలు ముందుభాగాన ఉండి పోరాడినట్టు గుర్తు చేస్తూ.. ఇండ్ల స్థలాల కోసం కూడా అదే స్ఫూర్తితో ఇక్కడి వారూ పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన రేవంత్‌రెడ్డి.. ఈ భూములకు పట్టాలు ఇస్తామని, ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల సీఎం అనేక సభల్లో మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెబుతున్నారని, మహిళలను కోటీశ్వరులను చేయడం ఏమో గానీ ఉండేందుకు ఇండ్లు కట్టిస్తే చాలని అన్నారు. ఇంటి నెంబర్‌, రేషన్‌, ఆధార్‌ కార్డులు జారీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి పేదలను తరలించే ప్రయత్నాలు చేయడం సబబు కాదన్నారు. పేదలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగదీశ్‌, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సుమలత, ఉపాధ్యక్షులు అరుణ, ఉమ, సీపీఐ(ఎం) నాయకులు కృష్ణ, శ్రీనివాస్‌, జంగయ్య, సీపీఐ, ఎంసీపీఐ, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -