Sunday, February 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభూములు ఇవ్వం

భూములు ఇవ్వం

- Advertisement -

మా ఉపాధిని దెబ్బతీయొద్దు
అభిప్రాయ సేకరణ సభలో తేల్చిచెప్పిన కొత్తపల్లి గ్రామస్తులు
భూ సేకరణకు సహకరించండి : ఆర్డీవో అనంతరెడ్డి


నవతెలంగాణ-యాచారం
‘మా భూములు ప్రభుత్వానికి ఇచ్చేది లేదు. అభిటఔద్ధి పేరుతో మా ఉపాధిని దెబ్బతీయొద్దు’ అని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామస్తులు తేల్చి చెప్పారు. శనివారం కొత్తపల్లిలో సర్పంచ్‌ చిక్కుడు వెన్నెలశేఖర్‌ అధ్యక్షతన అసైన్డ్‌ భూములపై రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ ఆనంతరెడ్డి రైతులతో మాట్లాడారు. కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 32, 178, 182, 222, 242, 317 మొత్తం ఐదు సర్వే నెంబర్లలో 2,141 ఎకరాల అసైన్డ్‌ భూమిని గుర్తించినట్టు తెలిపారు. ఇందులో 1100 ఎకరాల భూమిని రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు. మిగతా 1041 ఎకరాలు సాగుకు యోగ్యంగా లేకుండా గుట్టలు, రాళ్లు, చెట్లతో ఉందని వివరించారు. ఈ భూమినంతా ప్రభుత్వం తీసుకుంటుందని ఆర్డీవో చెప్పారు. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని స్పష్టం చేశారు.

రైతులు భూములు ఇస్తలేరని ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆర్డీవోను కోరారు. ఎన్నో ఏండ్ల నుంచి ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నట్టు తెలిపారు. ఆ భూముల్లో పశువులు, మేకలు పెంచుతూ వాటితోనే బతుకుతున్నామని చెప్పారు. అధికారులు తమకు తెలియకుండా సర్వేలు చేసి, భూములు తీసుకుంటామని చెప్పడం సరైంది కాదన్నారు. కంపెనీల పేరుతో భూములను గుంజుకోవడం సరికాదన్నారు. తక్షణమే భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ భూములను ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తాము భూములిచ్చేది లేదని.. ఈ విషయంలో అధికారులు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ అయ్యప్ప, ఇబ్రహీంపట్నం ఏసీపీ కెపివి రాజు, సీఐ, ఎస్‌ఐలు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -