ఇప్పటికే 1800 ఎకరాలు ప్రాజెక్టుకు ఇచ్చాం
భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి
నిమ్జ్ స్పెషల్ కలెక్టర్‌కు తేల్చి చెప్పిన సంగారెడ్డి జిల్లా ఎల్గోయి గ్రామస్తులు
నవతెలంగాణ-ఝరాసంగం
నిమ్జ్ ప్రాజెక్టుకు పంటలు పండే తమ భూములను ఎట్టి పరిస్థితిల్లో ఇవ్వబోమని, ప్రాణాలు పోయినా ఈ భూమిని వదులుకోబోమని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామస్తులు తేల్చి చెప్పారు. మంగళవారం రెండో విడత భూసేకరణకు సంబంధించి గ్రామంలో 195.13 గుంటల విస్తీర్ణానికి నిమ్జ్ ప్రాజెక్ట్ అధికారులు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి, తహసీల్దార్ తిరుమలరావు, గ్రామ సర్పంచ్ లక్ష్మీబాయి, ఉప సర్పంచ్ మహేష్ కుమార్ హాజరయ్యారు. జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతరావు ఆధ్వర్యంలో 50 మంది పోలీసు బలగాలను మోహరించి గ్రామ సభ నిర్వహించారు. ముందుగా భూసేకరణకు సంబంధించిన గెజిట్‌ను రైతులకు చదివి వినిపించారు. అనంతరం రైతులు, గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ భూములను ఇవ్వబోమని తెలిపారు. భూసేకరణకు సంబంధించి పూర్తి వివరాలు గ్రామసభ ముందు ఉంచలేదని, ఇది చట్ట విరుద్ధ భూసేకరణని, ఈ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ జారీ చేయడం మూలంగా బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదని, బ్యాంక్ అధికారులు కనీసం రెన్యువల్ కూడా చేయడం లేదని, రైతుబంధు రావడంలేదని, తమకు యూరియా బస్తాలు సైతం రాని పరిస్థితి నెలకొందని వాపోయారు. అమ్మకం-కొనుగోళ్లను సైతం నిలిపివేయడం ఎంతో బాధేస్తోందని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొదటి విడతలో భూములు ఇస్తే మళ్లీ రెండోసారి గ్రామం నుంచి భూములు తీసుకోబోమని గతంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, అప్పటి కలెక్టర్లు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అప్పుడు ప్రాజెక్టుకు తమ గ్రామం నుంచి దాదాపు 1800 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చామని తెలిపారు. మూడు పంటలు పండే తమ భూములను మళ్లీ కోల్పోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహకు, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్లకు చెబితే మా భూముల జోలికి రారని చెప్పారని తెలిపారు. మొత్తం నోటిఫికేషన్‌లో 222 మంది రైతులు తమ భూములను ఎట్టి పరిస్థితిల్లో ఇవ్వబోమని తమ ఏకాభిప్రాయాన్ని అధికారుల ముందుంచారు. రైతుల అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని నిమ్జ్ స్పెషల్ కలెక్టర్ రైతులకు వివరించారు.
భూసేకరణ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి
గ్రామంలో ఇప్పటికే దాదాపు 1800 ఎకరాల భూములు సేకరించారు. మళ్లీ ప్రభుత్వం 195 ఎకరాల కోసం నోటిఫికేషన్ వేయడం సమంజసం కాదు. నోటిఫికేషన్ వేసే కంటే ముందు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూములకు మార్కెట్ విలువలు సవరించాలి. నిమ్జ్ ప్రాజెక్టుకు సంబందించిన పూర్తి వివరాలను తెలుగులో ఇవ్వాలని రైతులు కోరినా ఇప్పటివరకు ఇవ్వలేదు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, పరిపాలన అనుమతులు, నిమ్జ్ ప్లాన్, సేకరించే భూముల వివరాలు, ఎలాంటి సమాచారాలూ అధికార యంత్రాంగం ఇవ్వకుండా ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇచ్చి రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గత ప్రభుత్వం వ్యవహరించినట్టుగానే ఈ ప్రభుత్వమూ వ్యవహరించడం దారుణం. 195 ఎకరాలకు వేసిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలి. అలాగే, గతంలో భూములిచ్చిన రైతులకు ఎకరానికి 120 గజాల ప్లాట్ ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు పునరావాసం కల్పించాలని కోరారు.
-బి.రామచందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు
మొదటి విడత భూములకు మార్కెట్ ధర ఇస్తారా? లేదా?
మొదటి విడతలో తీసుకున్న భూములకు మార్కెట్ ధర చెల్లిస్తారా.. లేదా.. అన్నది మొదటగా తేల్చాలి. మొదటి విడతలో భూములు తీసుకొని తొమ్మిందేండ్లు అవుతున్నా ఆ సమస్యకు పరిష్కారం చూపకుండా మళ్లీ రెండో విడతకు భూములు తీసుకుంటామని చెప్పడం ఏమిటి? ముందు దానికి సమాధానం చెప్పాలి.
-మన్యప్ప, రైతు
సారవంతమైన భూములివ్వం
మూడు పంటలు పండే సారవంతమైన భూములను ఇవ్వం. ఇప్పటికే ఇదే ప్రాజెక్టుకు ఏడెకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చాం. ప్రాజెక్టు కింద నాలుగెకరాల భూమిని తీసుకుంటే బయట అర్ధ ఎకరం కూడా రాదు.
-రామయ్య, రైతు
పంటలు పండే భూములు వదులుకోం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



