Sunday, August 3, 2025
E-PAPER
Homeజాతీయంబీజేపీకి 150సీట్లు దాటనివ్వం

బీజేపీకి 150సీట్లు దాటనివ్వం

- Advertisement -

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటుతాం
ఏఐసీసీ లీగల్‌ సెల్‌ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి
గత లోక్‌సభ ఎన్నికల్లో 70 నుంచి 100 సీట్లలో బీజేపీ రిగ్గింగ్‌
త్వరలో ఆధారాలు వెల్లడిస్తాం : రాహుల్‌గాంధీó
బీజేపీకి సాధారణ మెజార్టీ కూడా ఇవ్వలేదు : ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే
నవతెలంగాణ-న్యూఢిల్లీ

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు దాటనివ్వమనీ, ఈ విషయాన్ని ఆపార్టీ నేతలు డైరీల్లో రాసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ‘ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కుర్చీలో, ఓడితే ఇంట్లో కూర్చుంటాయి. కానీ గెలుపోటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్‌పార్టీ ఎప్పుడూ ప్రజలతోనే ఉంది’ అని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణలో ప్రధాని మోడీని ఓడించి కుర్చీ నుంచి దింపేందుకు రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ శ్రేణులన్నీ ఐక్యంగా పోరాడతాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ లీగల్‌ సెల్‌ సదస్సులో ‘రాజ్యాంగ సవాళ్లు- ధృక్పథం- మార్గాలు’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ఏం చేసిందని పదే పదే బీజేపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారనీ, దేశానికి స్వాతంత్రం రాకముందే కాంగ్రెస్‌ పార్టీ ఉన్నదనీ, బ్రిటిషర్లతో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిందే కాంగ్రెస్‌ అని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ను యుద్ధంలో ఓడించి ఆదేశాన్ని రెండు ముక్కలు చేసిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదే అని తెలిపారు. ఆమె ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించారనీ, దేశం కోసం గాంధీజీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ ప్రాణ త్యాగాలు చేశారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీని, బీజేపీని కాంగ్రెస్‌ పార్టీ ఓడిస్తుందని తేల్చిచెప్పారు. 2004లో ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా, సోనియాగాంధీ ఆ పదవిని త్యాగంచేసి మన్మోహన్‌ సింగ్‌కు ఇచ్చారనీ, ప్రణబ్‌ ముఖర్జీని రాష్ట్రపతి చేశారని చెప్పారు. రాహుల్‌ గాంధీ కోరుకుంటే 2004లోనే కేంద్రమంత్రి, 2009లోనే ప్రధానమంత్రి అయ్యేవారనీ, కానీ ఆయన ఆ రెంటినీ త్యాగం చేశారని తెలిపారు. కాంగ్రెస్‌పార్టీకి ‘త్యాగాలు కొత్తేం కాదనీ, పార్టీలో సామాన్య కార్యకర్తగానే రాహుల్‌గాంధీ కొనసాగుతు న్నారని చెప్పారు. పేదలు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, సామాజిక న్యాయం కోసం 25 ఏండ్లుగా రాహుల్‌గాంధీ పోరాడుతున్నారని కొనియాడారు. నరేంద్రమోడీ 2001 నుంచి కుర్చీ వదలడం లేదనీ, గుజరాత్‌ సీఎం అయింది మొదలు ఇప్పటి వరకు కుర్చీలోనే కూర్చుని ఉన్నారని అన్నారు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఫ్‌ుచాలక్‌ మోహన్‌ భగవత్‌ 75 ఏండ్లు నిండిన వారు కుర్చీ వదలాలని రెండు నెలల క్రితం చెప్పారని గుర్తుచేశారు. అద్వానీ, మురళీమనోహర్‌ జోషికి వర్తించే నిబంధనలు మోడీకి ఎందుకు వర్తించవని ప్రశ్నించారు. మోడీని ఆర్‌ఎస్‌ఎస్‌, వాజ్‌పేయీ కుర్చీ నుంచి దింపలేకపోయారనీ, వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ఆపని చేస్తారని స్పష్టంచేశారు. ఓబీసీలకు సామాజిక న్యాయం సాధించేందుకు రాహుల్‌ గాంధీ నేతత్వంలో పోరాడతామన్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌ : రాహుల్‌గాంధీ
గత లోక్‌సభ ఎన్నికల్లో 15 సీట్లు తగ్గి ఉంటే, మోడీ దేశానికి ప్రధాని అయ్యేవారు కాదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. గత ఎన్నికల్లో 70 నుంచి 100 సీట్లలో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడిందనీ, ఫలితాల తారుమారుపై ఆధారాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. తాను రాజును కావాలనుకోవడం లేదనీ, ఆ విధానానికే వ్యతిరేకమని చెప్పారు. మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం నాలుగు నెలల్లో కోటి మంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారనీ, దానిలో ఎక్కువ మంది బీజేపీ వాళ్లేనన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉనికిలోనే లేదనీ, అందువల్ల ఈ విషయాన్ని దేశ ప్రజలకే నిరూపిస్తామని చెప్పారు. బ్రిటిష్‌ సామ్రాజ్యానికే కాంగ్రెస్‌పార్టీ భయపడలేదనీ, కేంద్రంలోని మోడీ సర్కార్‌కు ఎలా భయపడ తామని అన్నారు. తనపై 30 కేసులు నమోదు చేసారని గుర్తుచేశారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలపై రైతులకు మద్దతుగా నిలవొద్దని తనను బెదిరించేందుకు ఒక బీజేపీ నేత సంప్రదించారని తెలిపారు. ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ), నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజర్‌ రాఫెల్‌ ఒప్పందంలో జోక్యం చేసుకొన్నారని స్పష్టంగా పేర్కొన్న ఒక డాక్యుమెంట్‌ కనుమరుగైందనీ, ఇదే ఘటన ప్రపంచంలోని ఏ ఇతర దేశంలో జరిగినా ప్రభుత్వాలు కూలిపోయేవని చెప్పారు.


సీఈసీ పీఎమ్‌ చేతిలో కీలుబొమ్మ : ఖర్గే
ప్రధాని మోడీ చేతిలో కేంద్ర ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని, నియంతృత్వం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందనీ, బీజేపీ సర్కార్‌ దానిని మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే, నిజంగా రాజ్యాంగాన్ని మార్చేవారని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు, ఆదివాసీలు, పేదలు, మైనారిటీ ఓటర్లకు ఓటు హక్కు లేకుండా చేయాలనే దురుద్దేశ్యంతో బీహార్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఆఫ్‌ ఓటర్‌ (ఎస్‌ఐఆర్‌) జాబితా తెచ్చారని ఖర్గే విమర్శించారు. ‘ఎస్‌ఐఆర్‌’ పేరుతో దాదాపు 65 లక్షల మందిని బీహార్‌ ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బందీ అయిన రాజ్యాంగం :సోనియా గాంధీ
బీజేపీ పాలనలో రాజ్యాంగం బందీ అయ్యిందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు. ఈ సదస్సులో ఆమె సందేశాన్ని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చదివి వినిపించారు. లీగల్‌ చార్టర్‌ కంటే దేశ రాజ్యాంగం గొప్పదన్నారు. స్వాతంత్య్రపోరాటం మొదలు ఏనాడూ దేశంలో స్వేచ్చ, సమానత్వం కోసం పోరాడని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఇప్పుడు వాటిని లేకుండా చేసేందుకు అధికార శక్తిని ఉపయోగిస్తున్నాయనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారనీ, అంబేద్కర్‌ దృక్పదానికి మూలస్తంభాలనైన సోషలిజం, లౌకికవాదాన్ని తుడిపేసే కుట్ర చేస్తున్నారని ఆ సందేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -