Saturday, December 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రాంతీయ భాషలను దెబ్బతీయాలనుకుంటే ఉపేక్షించం

ప్రాంతీయ భాషలను దెబ్బతీయాలనుకుంటే ఉపేక్షించం

- Advertisement -

సినీ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్‌రాజ్‌
‘దక్షిణ భారత భాషల గుర్తింపు, రాజకీయాలు’ పై జాతీయ సదస్సు


నవతెలంగాణ- జూబ్లీహిల్స్‌
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ భాషలపై దాడులు జరుగుతున్నాయని, దక్షిణాది భాషలను దెబ్బతీసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సినీ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. డా.బీఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం కళల విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ”దక్షిణ భారత భాషలు-గుర్తింపు, రాజకీయాలు” అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఒక్కరికీ తన మాతృభాషపై సహజమైన మమకారం ఉంటుందన్నారు. ”నీ భాషపై పట్టు సాధించు, ఇతర భాషలను గౌరవించు. కానీ పరాయి భాషను ఇతరులపై బలవంతంగా రుద్దే ప్రయత్నం మంచిది కాదు” అని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ భాషలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భాషలను కాపాడుకునేందుకు దక్షిణ భారత రాష్ట్రాల్లో సదస్సులు, సమావేశాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.

తన మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగు సహా ఏడు భాషలు మాట్లాడగలుగుతున్నానని చెప్పారు. తెలుగు స్పష్టంగా మాట్లాడగలగడానికి కారణం తనకు మాతృభాషతోపాటు ఇతర భాషలపై ఉన్న అభిమానం, గౌరవమేనన్నారు. దేశంలో అనేక భాషలు, విభిన్న ప్రాంతాలు, భిన్న మతాలు ఉన్నప్పటికీ గొప్ప ఐక్యత ఉందన్నారు. అయితే, కొందరు తమదే పురాతన భాష, తమదే గొప్పదన్న భావనతో ఇతర భాషలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో హిందీ మాత్రమే తెలిసి, ఇతర భాషలపై అవగాహన లేకపోవడంతో దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇతర ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయించే ఈ ధోరణిని ఐక్యంగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ జాతీయ సదస్సుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు ప్రాంతీయ భాషా ప్రముఖులు, అధ్యాపకులు, పరిశోధకులు హాజరై భాషల గుర్తింపు, రాజకీయాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -