Friday, July 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయందేశ వ్యవస్థలో ఎలాంటి జోక్యాన్నీ సహించం

దేశ వ్యవస్థలో ఎలాంటి జోక్యాన్నీ సహించం

- Advertisement -

ట్రంప్‌నకు లూలా షాక్‌లు
టారిఫ్‌కు భయపడబోమన్న బ్రెజిల్‌ అధ్యక్షుడు
తామూ 50 శాతం సుంకాన్ని విధిస్తామని వెల్లడి
అమెరికాకు బ్రెజిల్‌ గట్టి సందేశం
బ్రెజిల్‌ :
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు బ్రెజిల్‌ ప్రెసిడెంట్‌ లూలా డ సిల్వా గట్టి షాక్‌లే ఇస్తున్నారు. ప్రపంచదేశాలపై టారిఫ్‌ యుద్ధాన్ని కొనసాగిస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌.. బ్రెజిల్‌ పైనా భారీ సుంకాలు విధిస్తామన్నారు. బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడిపై జరుగుతున్న విచారణకు ముగింపు పలకాలన్న డిమాండ్‌తో ట్రంప్‌ ఈ బెదిరింపులకు దిగారు. బ్రెజిల్‌ న్యాయవ్యవస్థలో పరోక్ష జోక్యానికి ట్రంప్‌ ప్రయత్నించారు. అయితే బ్రెజిల్‌లోని ప్రగతిశీల ప్రభుత్వం మాత్రం ట్రంప్‌ బెదిరింపులకు తలొగ్గట ం లేదు. టారిఫ్‌లు విధించినా, తమ దేశ వ్యవస్థలలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసినా అందుకు తగిన పరిణామాలుం టాయని హెచ్చరించింది. పరస్పర సుం కాలకు వెనుకాడబోమని స్పష్టం చేసింది.

‘మేమూ 50 శాతం వసూలు చేస్తాం’
అమెరికా కొనసాగిస్తున్న టారిఫ్‌ వార్‌కు తాము తలొగ్గేది లేదని బ్రెజిల్‌ స్పష్టం చేస్తున్నది. బ్రెజిలియన్‌ గూడ్స్‌పై 50 శాతం సుంకం విధిస్తామంటూ డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనలు చేసిన విషయం విదితమే. బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో ఎదుర్కొంటున్న విచారణకు ముగింపు పలకాలంటూ ట్రంప్‌ ఈ టారిఫ్‌ బెదిరింపులకు దిగుతున్నారు. దీనికి సంబంధించి ఈనెల 7న బ్రెజిల్‌ ప్రభుత్వానికి లేఖను కూడా రాశారు. ట్రంప్‌ బెదిరింపులకు లూలా డ సిల్వా వెంటనే గట్టి సందేశాలే పంపారు. ఈ లేఖ బ్రెజిల్‌ను అవమానించటమేనని చెప్పారు. ఆయన మొత్తం ప్రపంచంతో ఈ విధంగానే వ్యవహరించాలని చూస్తున్నారని అన్నారు. బ్రెజిల్‌ నిర్ణయాలు, దాని న్యాయవ్యవస్థ సార్వభౌమా ధికారాన్ని కలిగి ఉంటాయని లూలా నొక్కి చెప్పారు. ఈ విషయంలో అవి ఎలాంటి జోక్యాన్నైనా తిరస్కరిస్తాయని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయన (ట్రంప్‌) మాపై 50 శాతం సుంకాన్ని విధిస్తే.. తాము కూడా ఆయనపై 50 శాతం టారిఫ్‌ను విధిస్తామని హెచ్చరించారు. ద్రవ్యలోటు విషయంలో యూఎస్‌ ఇచ్చిన సమాచారం అవాస్తవమన్నారు.

”బ్రెజిల్‌ ఉత్పత్తులు అమ్మకమవుతోన్న ప్రధాన దేశంగా ప్రస్తుతం అమెరికా లేదు. మా నుంచి కొనుగోలు చేసేదాని కంటే.. ఆ దేశం బ్రెజిల్‌కు అమ్ముతున్నదే ఎక్కువగా ఉన్నది. దీనర్థం ఈ ట్రేడ్‌ వార్‌ ద్వారా ఎక్కువగా నష్టపోయే ప్రమాదం యూఎస్‌కే ఉన్నది” అని ఆయన వివరించారు.టారిఫ్‌ బెదిరింపులతో బ్రెజిల్‌ తన వద్దకు చర్చలకు వస్తుందనుకున్న ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్‌ యంత్రాంగంతో చర్చలు జరపటానికి లూలా సిద్ధపడకపోవటాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ”మాకు అనేక ఆప్షన్‌లు ఉన్నాయి. మేము అంతర్జాతీయ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) వద్దకు వెళ్లి, అంతర్జాతీయ దర్యాప్తును ప్రారంభించొచ్చు. వైట్‌ హౌజ్‌ నుంచి వివరణలు కోరవచ్చు.

అయితే, బ్రెజిల్‌ గౌరవించబడుతుందని చూపించటమే ప్రధాన విషయం” అని లూలా పేర్కొన్న విషయాన్ని వారు చెప్తున్నారు. ట్రంప్‌ బెదిరింపుల నేపథ్యంలో లూలా నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలకు ఉపక్రమించింది. దేశంలోని పరస్పర చట్టం (రెసిప్రోసిటి లా)ను నియంత్రిస్తూ ఒక డిక్రీపై లూలా సంతకం చేశారు. దీని ప్రకారం బ్రెజిల్‌ అంతర్జాతీయ పోటీతత్వాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే ఏదైనా దేశం, సంస్థ తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా ప్రతిస్పందించటానికి ఇది దోహదం చేస్తుంది. అమెరికా చర్యలపై బ్రెజిల్‌లో ప్రజలు, కార్మిక సంఘాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్‌నకు వ్యతిరేకంగా బ్రెజిల్‌లో ఇప్పటికే అనేక నిరసనలు, ఆందోళనలు జరిగాయి. దక్షిణ అమెరికాలో బ్రెజిల్‌ ఒక అగ్రగామి ఆర్థిక వ్యవస్థ. బ్రిక్స్‌లోనూ ప్రస్తుతం భాగస్వామిగా ఉన్నది. ఈ దేశానికి కీలక వాణిజ్య భాగస్వామిగా చైనా ఉన్నది. అయితే బోల్సోనారోకు ముడిపెడుతూ పెద్ద ఎత్తున టారిఫ్‌లు విధించి, బ్రెజిల్‌ను చర్చలకు తీసుకొద్దామని ట్రంప్‌ భావించారనీ, అయితే లూలా ప్రభుత్వం అందకు తలొగ్గకపోవటంతో అమెరికా దిక్కుతోచని పరిస్థితిలో పడిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -