Thursday, February 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌ ఆక్రమణలు సహించం

ఇజ్రాయిల్‌ ఆక్రమణలు సహించం

- Advertisement -

అవి అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి : ఐరాస సభ్యదేశాల సంయుక్త ప్రకటన

న్యూయార్క్‌ : ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని విస్తరించుకునేందుకు ఇజ్రాయిల్‌ చేస్తున్న ప్రయత్నాలను 80కిపైగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఖండించాయి. పాలస్తీనాలో అధిక భాగం తన ఆస్తే అంటూ ఇజ్రాయిల్‌ చేస్తున్న వాదనను అవి తిప్పికొట్టాయి. వెస్ట్‌బ్యాంక్‌లో చట్టవిరుద్ధంగా తన ఉనికిని పెంచుకునేందుకు ఇజ్రాయిల్‌ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, చర్యలను తాము తీవ్రంగా నిరసిస్తున్నామని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్‌ మన్సూర్‌ తెలిపారు. ఐరాసలో ఎనభై ఐదు సభ్య దేశాల కూటమి, అనేక అంతర్జాతీయ సంస్థల తరఫున ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇజ్రాయిల్‌ నెరవేర్చాల్సిన కర్తవ్యాలకు ఇలాంటి నిర్ణయాలు భిన్నంగా ఉన్నాయని, కాబట్టి వీటిని వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆక్రమణ ఏ రూపంలో జరిగినా దానిని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

తూర్పు జెరూసలేం సహా 1967 నుంచి ఆక్రమించిన పాలస్తీనా భూభాగం యొక్క కూర్పును, స్వభావాన్ని, స్థితిని మార్చేందుకు ఇజ్రాయిల్‌ చేపట్టే అన్ని చర్యలనూ తిరస్కరిస్తున్నామని మన్సూర్‌ చెప్పారు. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తాయని, శాంతి-సుస్థిరత కోసం జరుగుతున్న ప్రయత్నాలను దెబ్బతీస్తాయని, ఇజ్రాయిల్‌-హమాస్‌ మధ్య గత నవంబరులో కుదిరిన సమగ్ర ప్రణాళిక ఒప్పందానికి భిన్నంగా ఉంటాయని, శాంతి ఒప్పందం దిశగా జరుగుతున్న ప్రయత్నాలను ప్రమాదంలో పడేస్తాయని తెలిపారు. ఇజ్రాయిల్‌ చర్యలు, నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సంయుక్త ప్రకటనపై సంతకాలు చేసిన దేశాలలో ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, పాకిస్తాన్‌, రష్యా, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, తుర్కియే, యూఏఈతో పాటు యూరోపియన్‌ యూనియన్‌, అరబ్‌ దేశాల లీగ్‌, ఇస్లామిక్‌ సహకార సంస్థ ఉన్నాయి. పాలస్తీనా భూభాగాన్ని 1967లో ఆక్రమించుకున్న తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లోని ఏరియా-సీలో భూ రిజిస్ట్రేషన్లను అమలు చేయాలని ఇజ్రాయిల్‌ నిర్ణయించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో సంయుక్త ప్రకటన వెలువడింది. వెస్ట్‌బ్యాంక్‌లోని 60 శాతం భూభాగం ఏరియా-సీలోనే ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -