– ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం
– స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తాం
– 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారమివ్వాలి
– గ్రామసభలు జరిపి రైతుల ఆమోదంతోనే భూమి తీసుకోవాలి
– ప్రజాప్రతినిధులు, ధనికులు, వ్యాపారుల కోసమే అలైన్‌మెంట్ మార్పు
– సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన వైఖరి ప్రకటించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్
– హెచ్‌ఎండీఏ కార్యాలయం వద్ద భూనిర్వాసితుల ధర్నా
– అలైన్‌మెంట్‌పై అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం : హెచ్‌ఎండీఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) కోసం బలవంతంగా భూములను లాక్కుంటే ఊరుకోబోమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామ సభలను నిర్వహించి రైతుల ఆమోదంతోనే భూములను సేకరించాలని డిమాండ్ చేశారు. రైతుల అనుమతి లేకుండా భూమిని తీసుకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని అన్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులంతా ఏకమై తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. 2013 చట్టంలోని షెడ్యూల్-1లో చూపిన విధంగా మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు, ఫార్మా సంస్థల యాజమానులు, ధనికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే అలైన్‌మెంట్‌లో ప్రభుత్వం మార్పులు చేస్తున్నదని విమర్శించారు. పేదల భూముల నుంచే వెళ్లేలా అలైన్‌మెంట్ మార్చడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్‌ఆర్‌ఆర్ భూ నిర్వాసితుల సమస్యలపై సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ కార్యాలయం వద్ద సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిర్వాసితులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అలైన్‌మెంట్ మార్పు, భూసేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ రాజకీయ నాయకులు, వ్యాపారులు, ధనికులు భూమి కోల్పోకుండా చిన్న రైతులు, పేదల భూములను మాత్రమే తీసుకునేలా అలైన్‌మెంట్‌ను మారుస్తున్నారని విమర్శించారు. పోలీసులను ఉపయోగించి రైతులను భయభ్రాంతులకు గురిచేసి వారి భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు ప్రకటించి హద్దులు పెడుతున్నారని అన్నారు.
భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేరని చెప్పారు. తరతరాలుగా ఆ భూమిపై ఆధారపడి బతుకుతున్నారని వివరించారు. అయినా బలవంతంగా ఆ భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. రైతులకు తెలియకుండానే భూమిని తీసుకుంటున్నదని చెప్పారు. భూమికి భూమి ఇవ్వాలనే నిబంధనను పట్టించుకోవడం లేదన్నారు. 2013 చట్టం ప్రకారం మార్కెట్ ధరకు నాలుగు రెట్లు పరిహారం ఇవ్వాల్సి ఉన్నా అమలు చేయడం లేదని చెప్పారు. ఎకరా రూ.10 కోట్లు, రూ.ఐదు కోట్లు ఉంటే ప్రభుత్వం రూ.పది లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షలు పరిహారం ఇస్తున్నదని వివరించారు. రైతుల ఆమోదం లేకుండా సెంటు భూమి తీసుకున్నా సహించేది లేదన్నారు. గ్రామసభలు జరిపి రైతుల ఆమోదం ఉంటేనే తీసుకోవాలని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రింగ్ రైలు వస్తుందంటున్నారనీ, దానికోసం భూసేకరణ అవసరమవుతుందని వివరించారు. ఆ భూములన్నీ వ్యవసాయ యోగ్యమైనవనీ, పంటలు పండుతాయని అన్నారు. రైతులకు అన్యాయం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రైతులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్చలు జరపం, నిర్బంధం ప్రయోగిస్తామంటే గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికీ పడుతుందని చెప్పారు. రైతులకు, నిర్వాసితులకు, ఆ భూములకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులను సంఘటితం చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
భూసేకరణ కోసం గ్రామసభలు నిర్వహిస్తాం : రవీందర్‌రెడ్డి
ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను తయారు చేసి హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో పొందుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించిం దని హెచ్‌ఎండీఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్‌రెడ్డి చెప్పారు. అలైన్‌మెంట్‌పై వచ్చిన అభ్యంతరాలు, సూచనలను క్రోఢకీరించి ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ఉత్తర భాగం పూర్తయ్యిందనీ, దక్షిణ భాగం ప్రభుత్వానికి పంపిస్తామని వివరించారు. భూసేకరణ వరకు ఇంకా వెళ్లలేదన్నారు. అలైన్‌మెంట్‌పై పబ్లిక్ నోటీసు ఇచ్చామని అన్నారు. గ్రామసభలు భూసేకరణ ప్రక్రియలో ఉంటాయన్నారు. ఈ వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు.
ఢిల్లీ తరహా రైతాంగ ఉద్యమం నిర్మిస్తాం : టి సాగర్
అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్ మాట్లాడుతూ అలైన్‌మెంట్‌పై రైతుల అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలైన్‌మెంట్, భూసేకరణకు సంబంధించి తప్పనిసరిగా గ్రామసభలు నిర్వహించాలని కోరారు. ఏ ఒక్క రైతు కూడా అన్యాయానికి గురైతే సహించేది లేదన్నారు. భవిష్యత్‌లో ఢిల్లీ తరహాలో రైతాంగ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
కాంగ్రెసోళ్లకు పదవుల్లో ఉండే అర్హత లేదు : ఎండీ జహంగీర్
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్ మాట్లా డుతూ ఓఆర్‌ఆర్ నుంచి 40 కిలో మీటర్ల దూరంలో ఆర్‌ఆర్‌ఆర్ ఉంటుందనీ తొలుత ప్రకటిం చారనీ, ఇప్పుడు 28 కిలోమీటర్లకు, 25 కిలోమీటర్లకు ఎందుకు తగ్గిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఫార్మా సంస్థల అధినేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములు పోతున్నందుకే అశాస్త్రీయంగా అలైన్‌మెంట్‌ను మార్చారని విమర్శించారు. రైతుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఆ పదవిలో ఉండే అర్హత లేదన్నారు. పదవులకు రాజీనామా చేస్తారా?, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పాత అలైన్‌మెంట్‌ను అమలు చేస్తారా? తేల్చుకోవాలని సవాల్ విసిరారు. సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ను వంకర టింకరగా ఎందుకు తిప్పుతున్నారో అర్థం కావడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కార్పొరేట్ల బిడ్డవా? ధనికుల బిడ్డవా? లేదంటే పేదల బిడ్డవా? తేల్చుకోవాలని అన్నారు. సీపీఐ(ఎం) సిద్ధిపేట జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి మాట్లాడుతూ రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలకు పుట్టగతులుండబోవని హెచ్చరించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ డిమాండ్లను తీసుకెళ్తామని చెప్పారు. హెచ్‌ఎండీఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ రవీందర్‌రెడ్డి ధర్నా శిబిరం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను సీపీఐ(ఎం) నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు డిజి నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ శ్రీరాం నాయక్, బి ప్రసాద్, కొండమడుగు నర్సింహ్మా, ప్రజాసంఘాల నాయకులు కోట రమేష్, ఎం శోభన్‌నాయక్ పాల్గొన్నారు.
భూములు లాక్కుంటే ఊరుకోం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES