Monday, July 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅమాయక ప్రజల జోలికొస్తే ఊరుకోం

అమాయక ప్రజల జోలికొస్తే ఊరుకోం

- Advertisement -

– పేదలు నివసిస్తున్న ప్రాంతంలోనే ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వాలి : సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జగదీశ్‌
– బసవతారకనగర్‌ గుడిసె వాసుల పోరాటానికి మద్దతు
నవతెలంగాణ-మియాపూర్‌

రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి డివిజన్‌ పరిధిలోని బసవతారకనగర్‌లో పేదల గుడిసెలను కూల్చివేసిన ప్రదేశాన్ని సీపీఐ(ఎం) నాయకులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) బృందానికి గుడిసెవాసులు తమ గోడును వెల్లబోసుకున్నారు. 30ఏండ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, కొంతమంది ప్రయివేట్‌ వ్యక్తులు వచ్చి తమ గుడిసెలను కూల్చివేశారని మొరపెట్టుకున్నారు. అనంతరం సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జగదీశ్‌ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్‌ బసవతారక్‌నగర్‌లో 30 ఏండ్లుగా ప్రభుత్వ స్థలంలో 500 కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ఇక్కడ ఉంటున్న పేద అమాయక ప్రజలను వెళ్లగొట్టేందుకు కొద్ది రోజులుగా ప్రయివేట్‌ వ్యక్తులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో వారి మద్దతుదారులు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ తక్షణమే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని, లేకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని అమాయక ప్రజలను భయపెట్టిస్తున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్‌ విభాగాలు ఇప్పటివరకు స్పందించకపోవడం శోచనీయమన్నారు. తమకున్న సమాచారం మేరకు స్థానిక ప్రజాప్రతినిధి, బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో సంబంధాలు పెట్టుకుని, పేద ప్రజలపై తన ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ చర్యలను మానుకోవాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రజల గుడిసెల పోరాటానికి తమ పార్టీ మద్దతును ప్రకటించారు. వీరికి ఆ ప్రాంతంలోనే ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేకుంటే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రకాష్‌ కారత్‌, స్థానిక పార్టీ నాయకులు కొంగరి కృష్ణ, జంగయ్య, శివన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -