Saturday, February 28, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపేదల ఇండ్లు కూల్చితే సహించం

పేదల ఇండ్లు కూల్చితే సహించం

- Advertisement -

– మూసీ నిర్వాసితులకు అండగా సీపీఐ(ఎం)
– రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరిక
– ‘గాంధీ సరోవర్‌’తో పేదల ఇండ్లను కూల్చి గాంధీకి చెడ్డపేరు తేవొద్దు : ఎండీ అబ్బాస్‌
– మూసీ నిర్వాసిత ప్రాంతాల సందర్శన
నవతెలంగాణ-సిటీబ్యూరో
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తే సీపీఐ(ఎం) చూస్తూ ఊరుకోదనీ, బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి టి. జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మూసీ నిర్వాసిత ప్రాంతాలుగా మారుతున్న కార్వాన్‌ నియోజకవర్గంలోని రాందేవ్‌ గూడా, పద్మావతి నగర్‌లో శుక్రవారం సీపీఐ(ఎం) రాష్ట్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. మూసీ నదిని పరిశుభ్రం చేయడానికి తాము వ్యతిరేకం కాదని అన్నారు. అయితే, సుందరీకరణ సాకుతో పేదల ఇండ్లను కూల్చి, ఆ విలువైన స్థలాలను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తే మాత్రం సహించేది లేదని స్పష్టంచేశారు. ఏండ్ల తరబడి నది ఒడ్డున నివాసముంటున్న పేదల ఇండ్లు కూల్చితే, పేదలే తిరగబడి ప్రభుత్వాన్ని కూల్చేస్తారని హెచ్చరించారు. నది ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను మాత్రమే తొలగించాలనీ, చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్న వారిని అక్కడి నుంచి తరలించి వారి ఉపాధిని దెబ్బతీయొద్దని డిమాండ్‌ చేశారు. వేల కోట్ల అప్పులు తెచ్చి పేదలను రోడ్డున పడేసే ప్రాజెక్టులు రాష్ట్రానికి అవసరం లేదనీ, పేదల అభివృద్ధికి ఉపయోగపడే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌ మాట్లాడుతూ.. గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ, ‘గాంధీ సరోవర్‌’ పేరుతో పేదల ఇండ్లు కూల్చాలనుకోవడం సరికాదన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు భూములు అప్పగించేందుకు గాంధీ పేరును వాడుకుని, ఆయనకు చెడ్డపేరు తేవొద్దని సూచించారు. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం సర్దార్‌ సరోవర్‌ పేరుతో గిరిజనులను నిర్వాసితులను చేసినట్టే, ఇక్కడ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అక్కడ నివసిస్తున్న పేదలకు అదే స్థలంలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, కేవలం నదిలోని చెత్తాచెదారం, పొదలు తొలగించి నీటిని శుద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ పర్యటనలో సీపీఐ(ఎం) హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. విఠల్‌, జోన్‌ కమిటీ సభ్యులు యాదయ్య, నరసింహతో పాటు బస్తీ అధ్యక్షులు రాజు, నరసింహ చారి, బస్తీ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -