Saturday, March 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఒత్తిడికి లొంగం

ఒత్తిడికి లొంగం

- Advertisement -

యుద్ధ విమానాల ల్యాండింగ్‌ కోసం అమెరికా అభ్యర్థనకు శ్రీలంక నో
ట్రంప్‌ వ్యూహాలకు దిసనాయకే బ్రేక్‌

కొలంబో: శ్రీలంకలోని మట్టాల అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ రెండు యుద్ధ విమానాలను దించేందుకు అమెరికాకు శ్రీలంక అనుమతి నిరాకరించిందని అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే శుక్రవారం కొలంబోలోని పార్లమెంటులో తెలిపారు. ఎర్ర సముద్రం, ఏడెన్‌ గల్ఫ్‌ల మధ్య కీలకమైన సముద్ర మార్గమైన జిబౌటిలో ఉన్న అమెరికా యుద్ధ విమానాల నుంచి మార్చి 4, 8 తేదీల్లో ఈ అభ్యర్థనలు రాగా..ఆ రెండింటినీ తిరస్కరించామన్నారు. ”జిబూటీలోని స్థావరం నుంచి ఎనిమిది నౌకా విధ్వంసక క్షిపణులతో కూడిన రెండు యుద్ధ విమానాలను మట్టాల అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకురావాలని అమెరికా కోరింది. కానీ మేం నిరాకరించాం” అని ఆయన అన్నారు.

అదే విధంగా ”ఎన్నో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మేం మా తటస్థతను కొనసాగించాలనుకుంటున్నాం. మధ్యప్రాచ్య యుద్ధం సవాళ్లను విసురుతోంది. కానీ మేం లొంగిపోం. ” అని దిసనాయకే అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమాసియా సంఘర్షణలోకి లాగబడకుండా ఉండాలన్న కొలంబో ఉద్దేశాన్ని ఆయన ఈ విధంగా స్పష్టం చేశారు. దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా ప్రత్యేక రాయబారి సెర్గియో గోర్‌తో సమావేశమైన తర్వాత దిసనాయకే ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం.. కీలకమైన సముద్ర మార్గాలను పరిరక్షించడం, ఓడరేవులను సురక్షితం చేయడం, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో-పసిఫిక్‌ను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరిగాయి.

అయితే ఈ చర్చలు జరిగినప్పటికీ, తమ తటస్థ వైఖరికి భంగం కలిగించే బాహ్య ఒత్తిళ్లను ప్రతిఘటిస్తామని శ్రీలంక నాయకత్వం సంకేతాలు ఇచ్చింది. హిందూ మహాసముద్ర ప్రాంతమంతటా, ముఖ్యంగా మధ్యప్రాచ్య సంఘర్షణ యొక్క దుష్ప్రభావాల కారణంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో, శ్రీలంక అనుసరిస్తున్న జాగ్రత్తతో కూడిన సమతుల్య చర్యను ఈ తిరస్కరణ స్పష్టం చేస్తుంది. అమెరికా సైనిక విమానాలకు ఆతిథ్యం ఇవ్వకూడదని కొలంబో తీసుకున్న నిర్ణయం, సైనిక కార్యకలాపాలలో చిక్కుకుపోతామనే లేదా ఒక పక్షానికి వత్తాసు పలుకుతున్నట్టుగా ప్రజలు భావిస్తారనే ఆందోళనలను ప్రతిబింబిస్తుంది.

వివాదంలో ఐరిస్‌ దేనా
హిందూ మహాసముద్రంలో శ్రీలంక దక్షిణ తీరంలో ఇటీవల ఒక సముద్ర ప్రమాదం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మార్చి 4న, గాలే సమీపంలో ఒక అమెరికా జలాంతర్గామి ఇరాన్‌ ఫ్రిగేట్‌ ‘ఐరిస్‌ దేనా’పై టార్పెడో దాడి చేసింది. ఈ ఘటనలో 84 మంది నావికులు మరణించారు. మరో 32 మందిని శ్రీలంక నావికాదళం రక్షించింది. భారతదేశంలో జరిగిన నావికా విన్యాసాల నుంచి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగిందని సమాచారం. ఈ ఘటన అనంతరం 219 మంది సిబ్బందితో ఉన్న మరో ఇరాన్‌ నౌక, ‘ఐరిన్స్‌ బుషెహర్‌’, కొలంబో ఓడరేవులోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. శ్రీలంక అధికారులు ఆ నౌకను తూర్పున ఉన్న ట్రింకోమలీ ఓడరేవుకు మళ్లించారు. ఆ సిబ్బందిలో 204 మంది నావికులకు ప్రభుత్వం తాత్కాలిక ప్రవేశ వీసాలు మంజూరు చేసి, కొలంబో సమీపంలోని ఒక నావికా కేంద్రంలో వసతి కల్పించింది. ఈ ఘటన.. అంతర్జాతీయ సముద్ర ప్రవర్తనపైనా, అగ్రరాజ్యాల మధ్య వైరుధ్యాల మధ్య చిక్కుకున్న చిన్న దేశాలకు ఎదురయ్యే ప్రమాదాలపైనా శ్రీలంకలో చర్చకు దారితీసింది.

అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనలు, ప్రాంతీయ స్థిరత్వంపై పడే సంభావ్య పరిణామాలపై చట్టసభ సభ్యులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంక నాయకత్వం కూడా విస్తత సంఘర్షణ వల్ల కలిగే ఆర్థిక పరిణామాలను గుర్తించింది. ద్వీప ఆర్థిక వ్యవస్థకు కీలక స్తంభాలైన ఇంధన సరఫరా, విదేశాల నుంచి వచ్చే డబ్బు, పర్యాటకం వంటి వాటికి అంతరాయాలు కలగడం ఇందులో భాగం. ఈ ఒత్తిళ్లు తటస్థత, అలీన విధానంపై కొలంబో యొక్క ప్రాధాన్యతను మరింత బలపరిచాయి. ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, అమెరికా యుద్ధ విమానాలను దిగడానికి అనుమతించని శ్రీలంక ధృఢమైన నిరాకరణ, సార్వభౌమాధికారానికి భంగం కలగకుండా లేదా సైనిక చర్యలకు వేదికగా మారకుండా అస్థిరమైన భౌగోళిక రాజకీయ వాతావరణాన్ని ఎదుర్కోవడానికి అది చేస్తున్న ప్రయత్నాన్ని స్పష్టం చేస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -