Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రశ్నిస్తాం...పోరాడుతాం...పరిష్కరిస్తాం

ప్రశ్నిస్తాం…పోరాడుతాం…పరిష్కరిస్తాం

- Advertisement -

సామాన్యుల కోసం కొత్త రాజకీయాలు : కల్వకుంట్ల కవిత
జాగృతిలో చేరిన రంజిత్‌ కుమార్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రశ్నిస్తూ, పోరాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గొంగళ్ల రంజిత్‌ కుమార్‌, ఆయన అనుచరులు జాగృతిలో చేరారు. వారికి కండువా కప్పి కవిత సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల్లోనే ఉంటూ పప్పన్నం తింటూ ప్రజలతోనే ఉంటూ వారితో కలిసి సామాన్యుల కోసం కొత్త రాజకీయాలను పరిచయం చేయబోతున్నట్టు తెలిపారు. సామాన్యుల చేత, సామాన్యుల కొరకు, సామాన్యులే ఉండే రాజకీయం తెస్తామని ప్రకటించారు. కొత్త పార్టీ ఆవిర్భవించే ఏప్రిల్‌ 25న తెలంగాణ చరిత్రను, భవిష్యత్తును మార్చే రోజుగా మిగులుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కోసం అంతర్జాతీయ నిపుణులతో సమావేశమై అద్భుతమైన అజెండాను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రజా సమస్యలను అధికార ప్రతిపక్ష పార్టీలు గాలికొదిలేశాయనీ, జాగృతి గళమెత్తుతున్నదని ప్రజల్లోకి వెళ్లిందని చెప్పారు.

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని కవిత విమర్శించారు. కేరళం ఎన్నికలకు రేవంత్‌ రెడ్డి సర్కార్‌ కాంగ్రెస్‌ ఏటీఎం మాదిరిగా పని చేస్తుందని దుయ్యబట్టారు. రియల్‌ ఎస్టేట్‌, హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి చేసే గులాంగిరీ పరాకాష్టకు చేరుకుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుభరోసా, రుణమాఫీ తదితర హామీలేవి అమలు చేయకుండా కేరళం వెళ్లి అక్కడ అన్ని చేశామని రేవంత్‌ రెడ్డి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పర్‌ భద్రకు కేంద్రం జాతీయ హోదా కారణంగా తుంగభద్రకు నీళ్లు రాక ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నష్టపోయే పరిస్థితి వచ్చినా రేవంత్‌ రెడ్డి బీజేపీని విమర్శించడం లేదని గుర్తుచేశారు.

గద్వాలలో కేతిదొడ్డి, గట్టు, ఐజా మండలాలు వెనుకబాటుతనంలో పోటీ పడుతున్నాయనీ, చేనేతలు, సీడ్‌ పత్తి విత్తనాల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కవిత తెలిపారు. సీడ్‌ పత్తి రైతులకు బకాయిలు ఇవ్వలేదనీ, మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ డి.కె.అరుణకు సంబంధించి 40 మంది ఏజెంట్లు రైతులను దోచుకుంటున్నారని కవిత ఆరోపించారు. చేనేత కార్మికులకు వెంటనే ఆర్డర్లు, నూలు, రంగులు యథావిధిగా కొనసాగించాలని కవిత డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో మొదట గెలిచేది రంజిత్‌ కుమార్‌ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు?
పార్టీ మారిన ఎమ్మెల్యేలను కూడా మోసే అచేతన స్థితిలో బీఆర్‌ఎస్‌ ఉందని కవిత విమర్శించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో? అనేది సస్పెన్స్‌గా మారిందన్నారు. గద్వాలలో చేనేత సమస్యలు, సీడ్‌ పత్తి రైతుల సమస్యలపై జాగృతి మాత్రమే పని చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -