– గిరిజనుల భూములకు సాగు నీరందిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– ఉట్నూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
గిరిజనులు సాగు చేసు కుంటున్న అటవీ భూములకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో డిప్యూటీ సీఎం పర్య టించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దంతన్‌పల్లి గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లింగంపెల్లి తారమ్మ గృహ ప్రవేశ మహోత్సవానికి హాజరై ఆమెకు పట్టుచీరను బహుకరించారు. కొలాం గూడ లోని కుమురం సూరు విగ్రహానికి పూలమాల వేసి కుమ్మరికుంట సమీపం లో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత గురుకుల పాఠశాల భవనానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా సౌర జల గిరి వికాసం పథకం ద్వారా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు సాగు నీరందిస్తామని తెలిపారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన కుమురం సూరు ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటివరకు జిల్లాకు రూ.150 కోట్ల నిధులను మంజూరు చేసినట్టు వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగం చేస్తూ, పనుల పురోగతిని బట్టి వారం వారం లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్ పాల్గొన్నారు.
ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూ సమస్యను పరిష్కరిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



