- Advertisement -
- త్రిబుల్ ఆర్ భూ నిర్వాసిత రైతులు
- శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆందోళన
నవతెలంగాణ-ఆమనగల్
‘మాకు జీవనాధారంగా మిగిలి ఉన్న కొద్దిపాటి పొలాల కోసం ప్రాణాలైనా అర్పిస్తాం’ అని త్రిబుల్ ఆర్ రోడ్డు భూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో ప్రకటించిన పాత అలైన్‌మెంట్ స్థానంలో భూస్వాములకు అనుకూలంగా, చిన్న, సన్నకారు రైతులకు ఉరి తాడుగా రూపొందించిన కొత్త అలైన్‌మెంట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రైతులు ఆమనగల్ పట్టణంలో ఆందోళన చేపట్టారు. తలకొండపల్లి మండలంలోని జంగారెడ్డి పల్లి, రాంపూర్, చంద్రదన, జూలపల్లి తదితర గ్రామాల రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం దగ్గరలోని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైటాయించారు. బడాబాబులకు, భూ స్వాములకు అనుకూలంగా రూపొందించిన కొత్త అలైన్‌మెంట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నూతన అలైన్‌మెంట్ దిష్టిబొమ్మను దహనం చేశారు. త్రిబుల్ ఆర్ రోడ్డు భూ నిర్వాసితులైన చిన్న, సన్నకారు రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చిన్న, సన్నకారు రైతులకు న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
- Advertisement -