అరెస్టులతో పోరు ఆగదు
ఉద్రిక్తంగా అంగన్వాడీల చలో హైదరాబాద్
ఇందిరాపార్కు చౌరస్తా నుంచి ర్యాలీ ముందుకెళ్లకుండా అడ్డగింత
అక్కడే బైఠాయించిన అంగన్వాడీలు, సీఐటీయూ నేతలు
మహిళలను గిచ్చుతూ… నెడుతూ బలవంతంగా ఈడ్చుకెళ్లిన పోలీసులు
పాలడుగు భాస్కర్‌ను లాక్కెళ్లడాన్ని అడ్డుకున్న మహిళలు
తోపులాటలో పలువురికి గాయాలు
ఒక్కసారిగా వందలాది మంది రాకతో పోలీసుల ఉక్కిరిబిక్కిరి
ఆటోల్లో, నడుచుకుంటూ వెళ్తున్న వారినీ వదలని వైనం
ఇందిరాపార్కు చుట్టుపక్కల కాలనీల్లో జల్లెడ పట్టి మరీ అరెస్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘జామ్ అవుతుందంటారా? ఈడ కడుపులు కాల్తున్నరు. 30, 40 ఏండ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నరు. జీతాలు సక్కగ ఇస్తలేరు. అంగన్వాడీలంటే అంత చిన్న చూపా? మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రి పూట అరెస్టులేంటి? ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసుకుంటామంటే అనుమతివ్వరా? ఇదేం ప్రజా ప్రభుత్వం? మేం వస్తున్నా మంటేనే సర్కారుకు వణుకు పుడుతోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ సర్కార్‌ను వదిలి పెట్టం. రాష్ట్ర సర్కారుకు మా సత్తా ఏంటో చూపుతాం. చంద్రబాబుకు పట్టిన గతే పట్టిస్తాం’ అంటూ అంగన్వాడీ టీచర్లు సర్కారుపై తమ నిరసన గళాన్ని ఎక్కుపెట్టారు.
తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపు ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగానూ ఆదివారం నుంచే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, పలువురు కీలక నేతలను అర్ధరాత్రే అదుపులోకి తీసుకున్నప్పటికీ వందలాది మంది అంగన్వాడీ టీచర్లు తమదైన శైలిలో హైదరాబాద్ బాట పట్టారు. సోమవారం ఉదయం 11:00 గంటల వరకు ఇందిరాపార్కు, ఎన్టీఆర్ స్టేడియం వైపు ఒక్క అంగన్వాడీ కూడా కనిపించలేదు. పదినిమిషాల్లోనే కాలనీల్లో నుంచి వందలాది మంది ఎన్టీఆర్ స్టేడియం వెనుకవైపు పోగై ర్యాలీగా బయలుదేరారు.
అశోక్‌నగర్ చౌరస్తా వరకు ఇందిరా పార్కు చౌరస్తా వరకు ‘ఇదేమి రాజ్యం…ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం…అర్ధరాత్రి పూట అంగన్వాడీల అరెస్టా సిగ్గు..సిగ్గు…, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..నెరవేర్చాలి…ప్రీ ఫ్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే కొనసాగించాలి..కొనసాగించాలి’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు. అశోక్‌నగర్ చౌరస్తాలోనే పోలీసులు అడ్డగించే ప్రయత్నం చేయగా…అంగన్వాడీలు అలాగే ముందుకెళ్లారు. పోలీసులు అలర్ట్ అయ్యి లోయర్‌ట్యాంక్ బండ్ వైపు వెళ్లే రోడ్డును బారీ కేడ్లతో కాసేపు మూసేశారు. చౌరస్తాలోనే ముందుకెళ్లకుండా తాళ్లతో అడ్డుకున్నారు.
దీంతో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర నేతలు జె.వెంకటేశ్ భూపాల్, పద్మశ్రీ, శ్రీకాంత్, సుధాకర్, సోమన్న, అంగన్వాడీ టీచర్లు అక్కడే బైఠాయించారు. ఊహించని పరిణామంతో ఉన్నతాధికారులు ‘ఇంత మంది పోగయ్యే దాకా ఏం చేస్తున్నారయ్యా. వెహికల్ తెచ్చి ఎక్కించండి’ అంటూ కిందిస్థాయి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ట్రాఫిక్ జామ్ అవుతున్నది లెండి’ అంటూ ఓ ఉన్నతాధికారి గర్జించగా…’జామ్ అవుతుందంటారా? ఈడ మా కడుపులు కాల్తున్నరు…ఎంత బాధైతే రోడ్లమీదికొస్తం’ అంటూ ఓ అంగన్వాడీ టీచర్ ఎదురు ప్రశ్నించింది. ఈ లోగానే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పెద్దమొత్తంలో వచ్చి మహిళలను బలవంతంగా లాక్కెళ్లారు.
‘మీరూ ఆడోళ్లే. మేమూ ఆడోళ్లమే. గిచ్చడమేంటి?’ అంటూ ఆడపోలీసుల్ని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నా వినకుండా తోసుకుంటూ..గిచ్చుకుంటూ లాక్కెళ్లి పోలీసు వాహనాలను ఎక్కించారు. పాలడుగు భాస్కర్, జె.వెంకటేశ్‌లను లాక్కెళ్లకుండా మహిళలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. చెప్పులు తెగి రోడ్లమీద పడ్డాయి. అంబర్‌పేట, ముషీరాబాద్, కాచిగూడ, తదితర పోలీసు స్టేషన్లకు అరెస్టు అయిన వారిని పోలీసులు తరలించారు. అరెస్టుల పర్వం జరుగుతుండగానే జిల్లాల నుంచి వచ్చిన అంగన్వాడీల వాహనాలను, ఆటోలను ఎన్టీఆర్ స్టేడియంలోకి పంపారు. అక్కడ నుంచి పోలీసు వాహనాల్లో ఎక్కించి పీఎస్‌లకు తరలించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు.
అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరు సరిగాదు : పాలడుగు భాస్కర్
అంగన్వాడీ టీచర్లు, ఆయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి పాలడుగు భాస్కర్ తప్పుబట్టారు. మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రి పూట ఇండ్లలోకి వెళ్లి లాక్కెళ్లడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. నేతలను అరెస్టు చేసినంత మాత్రాన పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నామంటూనే నూతన జాతీయ విద్యావిధానాన్ని ఎందుకు అమలు చేయాలని చూస్తున్నారని రేవంత్‌రెడ్డి సర్కార్‌ను ప్రశ్నించారు.
ఎన్‌ఈపీని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మూడు, నాలుగు దశాబ్దాలుగా కేంద్రాలనే నమ్ముకుని పని చేస్తున్న అంగన్వాడీ టీచర్ల ఉపాధికి ఎసరు పెట్టొద్దని కోరారు. ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించేలా చూడాలని విన్నవించారు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.



