మంత్రి అజహరుద్దీన్…సచివాలయంలో క్రిస్మస్ వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తా మని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో సచివాలయ క్రైస్తవ ఉద్యోగుల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ క్రిస్మస్ అనేది ఆనందం, సంతోషం, ఐక్యతతోపాటు ప్రేమ, శాంతి, కరుణ సందేశాలను సమాజానికి చాటి చెప్పే పవిత్ర పండుగ అని అన్నారు. తాను క్రైస్తవ విద్యాసంస్థలో చదువుకున్నాననీ, అక్కడ ప్రతి ఏటా క్రిస్మస్‌ను ఎంతో ఆత్మీయంగా, ఆహ్లాదకర వాతావరణంలో జరిపే వారని గుర్తు చేశారు. స్నేహితులు, ఉపాధ్యాయులతో కలిసి ఐక్యత, స్నేహభావం నిండిన వాతావరణంలో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న రోజులను ఆయన స్మరించుకున్నారు. బాక్సింగ్ డే సందర్భంగా క్రికెట్ ఆడటం తన విద్యార్థి దశలో ఒక మధురమైన సంప్రదాయమని చెప్పారు. అవి క్రమశిక్షణ, జట్టు సమన్వయం, క్రీడాస్ఫూర్తి, పరస్పర గౌరవం వంటి విలువలను నేర్పాయని వివరించారు. క్రిస్మస్ పండుగ పేదల పట్ల సానుభూతి, ఇతరులతో భావాలను పంచుకునే స్వభావం, సమాజంలో పరస్పర సంబంధాలను బలపరచుకోవాల్సిన అవసముందని అన్నారు. ఇలాంటి పండుగలు సామాజిక సామరస్యతను పెంపొందిస్తూ, భారతదేశపు ”వైవిధ్యంలో ఏకత్వం” అనే మహత్తర సంప్రదాయాన్ని మరింత బలపరుస్తాయని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నదనీ, శాంతియుతంగా, సమగ్రంగా, ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రేవ్ జాన్‌వెస్లీ ప్రేరణాత్మక క్రైస్తవ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ సబిత, సచివాలయ క్రైస్తవ ఉద్యోగుల సంఘం సభ్యులు లాల్ బహదూర్ శాస్త్రి, చిట్టి బాబు, శశిభూషణ్, మనోహరమ్మ, జాకబ్ రాస్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గిరి శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి ప్రేమ్, మహిళా అధ్యక్షురాలు రమ తదితరులు పాల్గొన్నారు.
క్రైస్తవుల సమస్యలు పరిష్కరిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



