Friday, July 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటాం

పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటాం

- Advertisement -

– నిబంధనల పేరిట ఇబ్బందులు పెట్టం
– యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: పారిశ్రామికవేత్తల సంఘాల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టే పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో సీఐఐ, ఫిక్కి, ఎఫ్‌టీసీసీఐ తదితర సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. చట్టాలు, నిబంధనల పేరిట ఇబ్బందులు పెట్టబోమని ఈ సందర్భంగా మంత్రి వారికి హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అండగా ఉండే ఎంఎస్‌ఎంఈ రంగానికి అన్ని రకాల రాయితీలు సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గత సర్కార్‌లా ఏక పక్షంగా వ్యవహరించకుండా అభివృద్ధిలో అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్‌ మాడల్‌గా మారిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రూ.3లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకు రావడం ద్వారా దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పించిందని మంత్రి వివరించారు. తెలంగాణ అభివృద్థి కోసం నిబద్ధతతో పని చేస్తుంటే పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని బీఆర్‌ఎస్‌, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. క్షేత్ర స్థాయిలో తామెదుర్కొంటున్న సమస్యలను, ఈ సందర్భంగా పలువురు పరిశ్రమల యజమానులు ప్రస్తావించిన అంశాలపై మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారు. పారిశ్రామికవేత్తలు లేవనెత్తిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సంజరుకుమార్‌, కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్‌, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తి, తెలంగాణ మినిమం వేజెస్‌ అడ్వైజరీ బోర్డు చైర్మెన్‌ బి.జనక్‌ ప్రసాద్‌, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు సమీవుద్ధీన్‌, రాజీవ్‌ వెంకటరమణ, రామచంద్రరావు, శేఖర్‌రెడ్డి, జయదేవ్‌, సుజాత, రమాదేవి, సుధీర్‌రెడ్డి, సునిల్‌ గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -