– మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
– పరిహారం చెక్కులు అందించిన ఎమ్మెల్యే, అధికారులు
– తాండూరు-వికారాబాద్ రోడ్డును మూడు నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడి
నవతెలంగాణ-తాండూరు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాపూర్ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారు, గాయపడిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చెప్పారు. ప్రమాదంలో నియోజకవర్గానికి చెందిన 13 మంది మృతిచెందడం బాధాకరమని అన్నారు. తాండూరు-వికారాబాద్ రోడ్డు మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. తాండూరు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన మహమ్మద్ ఖలీద్, సలీహ, జాహీరా ఫాతిమా కుటుంబాలను బుధవారం ఆయన పరామర్శించారు. ప్రభుత్వం తరపున రూ.7 లక్షల చొప్పున ముగ్గురికి అందజేశారు. అదేవిధంగా తాండూరు మండలం గౌతాపూర్‌కు చెందిన ముస్కాన్ బేగం, తాండూరు పట్టణం వాల్మీకినగర్‌కు చెందిన కిష్టాపురం వెంకటమ్మ, బృందావన్ కాలనీకి చెందిన తబాస్సుం జహాన్, ఓల్డ్ తాండూరుకు చెందిన దస్తగిరి బాబా (బస్సు డ్రైవర్) కుటుంబాలను కూడా పరామర్శించారు. రూ.7 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. యాలాల్ మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన సాయిప్రియ, నందిని, తనుష ఇండ్లకు వెళ్లి పరిహారం చెక్కులు ఇచ్చారు. యాలాల్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన కురుగంట బందప్ప, కురుగంట లక్ష్మీ దంపతులు మృతిచెందడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఇద్దరికి కలిపి రూ.14 లక్షల చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీలత, డిప్యూటీ ఆర్‌ఎం సరస్వతి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పటోళ్ల బాల్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అమీర్ అబ్దుల్లా, అబ్దుల్‌రావుఫ్, అజ్మల్, రెవెన్యూ, ఆర్టీసీ అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఉంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



