Tuesday, September 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్‌ఆర్‌ఆర్‌పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలేస్తాం

ఆర్‌ఆర్‌ఆర్‌పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలేస్తాం

- Advertisement -

సర్కారు దిగిరావాలంటే స్థానిక ఎన్నికలను బహిష్కరించాల్సిందే
తెలంగాణ భవన్‌ ‘జనతా గ్యారెజ్‌’లాంటిది : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ వల్ల నష్టపోయిన బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భరోసానిచ్చారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలేస్తామని హెచ్చరించారు. సమస్య పరిష్కారమయ్యే వరకూ పోరాడతామని ఆయన హామీనిచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ వల్ల నష్టపోయిన నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు గజ్వేల్‌, సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బాధితులు సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల ముందు రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో ఎవరికీ ఇబ్బంది ఉండబోదంటూ హామీనిచ్చారని గుర్తు చేశారు. అందువల్లే రైతులు కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపించారని అన్నారు. అయితే అధికారంలోకి వచ్చాక అలైన్‌మెంట్‌ను మార్చిన ప్రభుత్వం రైతులకు తీవ్ర నష్టం చేకూర్చేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్‌ నేతలు సైతం గెలిచిన తర్వాత రైతులను పూర్తిగా మర్చిపోయారని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో భూసేకరణ సమస్యలు ఎదురైనప్పుడు తమ ప్రభుత్వం నేరుగా రైతులతో చర్చలు జరిపి, వారికి పునరావాసం కల్పించిందని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తద్వారా శాశ్వత పరిష్కారాలు చూపించిందని వివరించారు. కానీ నేటి కాంగ్రెస్‌ సర్కారు మాత్రం అవుటర్‌ రింగ్‌ రోడ్డుతోపాటు ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలోనూ అలైన్‌మెంట్లను మార్చి పేదలు, రైతుల జీవితాలను ఆగం చేస్తోందని ఆరోపించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు బాధితులు తమ డిమాండ్లను సాధించుకోవడానికి ఐకమత్యాన్ని ప్రదర్శించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన తీర్మానాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని సూచించారు. ఇలా చేస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొస్తాయని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ భవన్‌ అనేది జనతా గ్యారేజ్‌ లాంటిది. రైతులు ఎప్పుడైనా ఇక్కడికొచ్చి న్యాయ నిపుణులను సంప్రదించవచ్చు, సహకారం తీసుకోవచ్చు, సలహాలు పొందవచ్చు” అని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -